ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బొగ్గు లారీ.. వ్యక్తి కాలు నుజ్జునుజ్జు
జైపూర్, ఆంధ్రప్రభ :
బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం జైపూర్ మండలం ఇందారం జాతీయ రహదారిపై ఐకే వన్ ఏ మూలమలుపు వద్ద చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామానికి చెందిన ఇన్నంనేని ముత్యంరావు తన స్వగ్రామమైన జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇందారం జాతీయ రహదారిపై ఐకే వన్ ఏ మూలమలుపు వద్ద రోడ్డు దాటుతుండగా.. శ్రీరాంపూర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ఆయన వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముత్యంరావు ఎడమ కాలు నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు జైపూర్ ఎస్సై భూమేష్ తెలిపారు.
