పైలట్ మచ్చార్‌పై దాడి.. విచారణలో షాకింగ్ విషయాలు!
పైలట్ స్మిత్ మచ్చార్‌పై కో-పైలట్ దాడి..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి జరిగిన కుట్ర ఘటనలో విచారణ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ విమాన ప్రమాద కుట్ర వెనుక ఉన్న కో-పైలట్ పేరు హమామ్ అల్ హమామీగా అధికారులు గుర్తించారు. విమానాన్ని తన స్వాధీనంలోకి తీసుకుని ధ్వంసం చేయడమే లక్ష్యంగా అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వివిధ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకున్న భారతీయ పైలట్
అధికారుల కథనం ప్రకారం.. యూఏఈ-ఇజ్రాయెల్ మధ్య నడిచే ఫ్లైదుబాయ్ విమానంలో తొలుత ప్రధాన పైలట్ అయిన స్మిత్ మచ్చార్‌పై హమామీ తీవ్రస్థాయిలో భౌతిక దాడికి దిగాడు. విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోవడమే అతని ప్లాన్. అయితే, స్మిత్ మచ్చార్ తీవ్ర గాయాలైనప్పటికీ ధైర్యంతో, ప్రాణాలను పణంగా పెట్టి కో-పైలట్‌ను ప్రతిఘటించడంతో భారీ ప్రమాదం తప్పింది.
ముందే ఉగ్ర భావజాలం.. ఒమన్ ఎయిర్ నిషేధం!
హమామ్ అల్ హమామీకి సంబంధించి విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒమనీ తండ్రి, సిరియా తల్లికి జన్మించిన హమామీ, సిరియాలో నివసిస్తున్న సమయంలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 2024లో ఒమన్ ఎయిర్‌లో ట్రైనీ కో-పైలట్‌గా ఉన్నప్పుడే అతని వద్ద తీవ్రవాద మెటీరియల్ లభించడంతో ఆ సంస్థ ఉద్యోగం నుండి తొలగించి ప్రయాణాలపై నిషేధం విధించింది. ఆ తర్వాత రాయల్ ఎయిర్ మారోక్‌లో పనిచేసి, ఈ ఏడాది జనవరిలో ఫ్లైదుబాయ్‌లో చేరాడు. గతంలో భద్రతాపరమైన నిషేధాలు ఉన్నప్పటికీ ఫ్లైదుబాయ్ అతడిని విధుల్లోకి తీసుకోవడం గమనార్హం.
మొసాద్, షిన్ బెట్ రంగంలోకి..
ప్రస్తుతం హమామీని సౌదీ అరేబియా నుండి యూఏఈకి తరలించి విచారిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్లే విమానంలో నిషేధం ఉన్న వ్యక్తికి ఎలా అనుమతి లభించిందనే కోణంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు మొసాద్, షిన్ బెట్ సహా మిలిటరీ, రవాణా మంత్రిత్వ శాఖలు తీవ్రస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాయి.
