CM Vijay | కారు పైకప్పుపై 40 కి.మీ. డెడ్లీ రైడ్.. పోలీసు ధైర్యానికి సీఎం సన్మానం!

చెన్నై, ఆంధ్రప్రభ: గుట్కా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగించి విధి నిర్వహించిన తమిళనాడు పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం. వెల్మురుగన్‌ను ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ అభినందించారు. రెండురోజుల క్రితం కోయంబత్తూరు సమీపంలో గుట్కా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్‌ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో వెల్మురుగన్‌ కారు పైకప్పుపైకి ఎక్కి.. దాదాపు 40 కిలోమీటర్ల పాటు అదే వాహనాన్ని పట్టుకుని ప్రయాణించారు. చివరకు పోలీసులు వాహనాన్ని అడ్డుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సాహసోపేత చర్యకు గుర్తింపుగా వెల్మురుగన్‌ను ముఖ్యమంత్రి సచివాలయానికి పిలిపించి ఘనంగా సత్కరించారు.

ప్రాణాలకు తెగించి సాహసం..

సెప్టెంబర్‌ 27న తెల్లవారుజామున కోయంబత్తూరు పరిధిలోని కోవిల్‌పాళయం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక నుంచి కోయంబత్తూరుకు నిషేధిత పొగాకు ఉత్పత్తులు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ ఎస్‌యూవీని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు.

కోవిల్‌పాళయం పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విఘ్నేశ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ వెల్మురుగన్‌ వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో వాహనంలోని వ్యక్తులు తొలుత ఆపినట్టే కనిపించినా.. ఒక్కసారిగా కారును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. వాహనం ఆగకుండా వేగంగా వెళ్తుండటంతో నిందితులు పట్టుకోవాలని వెల్మురుగన్‌ కారు పైకప్పుపైకి ఎక్కారు. అక్కడ ఉన్న రూఫ్‌ రైల్స్‌ను గట్టిగా పట్టుకొని దాదాపు 40కిలో మీటర్లు మేర అలాగే కారుపై ఉన్నారు. అయితే ఈ దృశ్యాన్ని పలువులు వాహనదారులు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

వాహనం తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో కోయంబత్తూరు పోలీసులు పొరుగున ఉన్న తిరుప్పూర్‌ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. హైవే పెట్రోల్‌ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. దాదాపు గంటపాటు కొనసాగిన వెంటాడే చర్య అనంతరం కరుమత్తంపట్టి ప్రాంతంలో వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వెల్మురుగన్‌ను సురక్షితంగా కిందకు దించారు.

వెల్మురుగన్‌కు మంత్రుల అభినందనలు

వెల్మురుగన్‌ సాహసంపై తమిళనాడు ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె. ముత్తుసామి, సంక్షేమ శాఖ మంత్రి ఆర్‌.ఎస్‌. రాజకన్నప్పన్‌ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడి అభినందించారు. ఆయన ధైర్యాన్ని ముఖ్యమంత్రి విజయ్‌ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు తెలిపారు.

సచివాలయానికి పిలిచి సీఎం సన్మానం

కాగా నేడు వెల్మురుగన్‌ను ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ సచివాలయానికి పిలిపించి ఆయన సాహసాన్ని అభినందించి సత్కరించారు. విధి నిర్వహణలో చూపిన ధైర్యాన్ని సీఎం ప్రశంసించారు.

‘‘మేము మా విధినే నిర్వర్తించాం’’

తన సాహసంపై వెల్మురుగన్‌ మాట్లాడుతూ.. పోలీసులు విధుల్లో భాగంగానే తాము నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో నిందితులు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో తాను కారు పైకప్పుపైకి ఎక్కి రూఫ్‌ రైల్స్‌ను పట్టుకున్నానని చెప్పారు. చివరకు పోలీసులు వాహనాన్ని అడ్డుకుని నిందితులను పట్టుకున్నారని వివరించారు.