CM vijay |కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్‌

ఆంధ్రప్రభ, ఇంద్ర‌కీలాద్రి : తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం విజయ్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సీఎం విజయ్‌ తన పర్యటనలో భాగంగా మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అనంతరం విజయవాడ ఉత్సవ్‌ 2.0 కార్యక్రమంలో సీఎం విజయ్‌ పాల్గొననున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో నగరంలో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్‌ కె. రామచంద్ర మోహన్‌, ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌ సంయుక్తంగా అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ ఎంపీ కేసినేని చిన్ని, కలెక్టర్, దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.