సీఎం రేవంత్ కీలక ప్రకటన
- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
- గౌడలకు 50 వేల కాటమయ్య కిట్లు పంపిణీ చేశాం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి, అనంతరం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అర్హులైన గీత, చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ పింఛన్లు అందేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. గౌడ సోదరులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు గౌడ కార్మికులు మృతిచెందితే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు.
కాలువల గట్లపై ఈత, తాటి చెట్లు..
గీత కార్మికుల వృత్తిని కాపాడేందుకు నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత, తాటి చెట్లను పెద్దఎత్తున నాటాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. గీత కార్మికులకు చెట్ల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి..
దొరలు, భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు ప్రాంతంలో ఆయన పోరాట స్ఫూర్తి అందరికీ తెలుసన్నారు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు.
ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం..
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గీత కార్మికులు, గౌడ సంఘాల నుంచి చాలాకాలంగా విజ్ఞప్తులు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. తానే స్వయంగా నెక్లెస్ రోడ్ చౌరస్తా వద్ద స్థలాన్ని పరిశీలించి, జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహం కోసం స్థలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.
సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ట్యాంక్‌బండ్‌పై పర్యాటక శాఖ కార్యాలయం ఉన్న స్థలంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే ప్రతి ఒక్కరికీ పాపన్న స్ఫూర్తి గుర్తుండేలా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.
బహుజనుల నుంచి వచ్చిన వీరుడు..
సర్దార్ సర్వాయి పాపన్న ఒక కులానికి లేదా కుటుంబానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని, బహుజనుల నుంచి ఎదిగిన వీరుడు అని ముఖ్యమంత్రి అన్నారు. బహుజనులతో కలిసి పోరాడి గోల్కొండ కోటపై జెండా ఎగురవేశారని గుర్తుచేశారు. ఆయన పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ నిలిచి ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ బహుజనుల రాష్ట్రంగా, సామాజిక న్యాయం, జీవించే స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రంగా ఉండాలని అన్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎంత గౌరవం ఉంటుందో, తెలంగాణలో బహుజనులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు.
కులవృత్తిని గౌరవించండి.. పిల్లలను చదివించండి
కులవృత్తులను కొనసాగించడంతో పాటు వాటిని గౌరవించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అయితే పిల్లలకు మాత్రం మంచి విద్య అందించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తును మార్చే శక్తి విద్యకే ఉందని, వారిని చదివించి ఉన్నత స్థానాలకు చేరేలా చేయాలని అన్నారు.
విద్యార్థుల కోసం అవసరమైనన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని పేర్కొన్నారు.
పిల్లలు ఉన్నత స్థానాలకు చేరాలంటే చదువు ఒక్కటే మార్గమని, తల్లిదండ్రులు కష్టమైనా పిల్లలను తప్పనిసరిగా బడికి పంపించాలని సూచించారు. ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం అందిస్తున్నట్లు తెలిపారు.
సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం
తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీసీ కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టామని చెప్పారు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

