CM Revanth Reddy Delhi Tour |తాడో, పేడో ఇకనైనా తేల్చేయండి.. లేదంటే తేలిపోతారు!

  • ఢిల్లీ వెళ్లే ముందు సీఎం రేవంత్‌ రెడ్డికి పార్టీ సీనియర్ల సిఫారసు
  • అధికార పార్టీలో గళం విప్పిన నేతలపై వేటుకు రంగం సిద్ధం?
  • ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జోరందుకున్న ఊహాగానాలు
  • ఏఐసీసీ పెద్దల అభిప్రాయం ఎలా ఉంటుందో అన్నది ప్రస్తుతానికి సందిగ్ధం
  • వేటు వేస్తే గనుక.. మంత్రి కొండాతో పాటు మరో ఇద్దరు కూడా ఉండే అవకాశం
  • లేదంటే, పదవి నుంచి తప్పించి మంత్రివర్గ ప్రక్షాళన?
  • అంతుచిక్కని విధంగా అంచనాలు, రాజకీయ విశ్లేషణలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : రాష్ట్రంలో అధికార పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఎట్టకేలకు హస్తిన చేరాయి. రెబల్స్‌పై చర్యలు, పార్టీలో, ప్రభుత్వంలో ప్రక్షాళన తదితర అంశాలపై అధిష్టానం ఏం చెబుతుందో తెలియదు కానీ, ఢిల్లీకి వెళ్లేముందు సీఎం రేవంత్‌ రెడ్డితో పార్టీ సీనియర్లు మాత్రం తమతమ అభిప్రాయాలను తేల్చి చెప్పేశారు. ఈ వ్యవహారంపై ‘తాడో, పేడో ఇకనైనా తేల్చేయండి.. లేదంటే ముఖ్యమంత్రిగా చులకనై ప్రజల్లో తేలిపోతారు. విపక్ష పార్టీల వ్యూహానికి ఆయుధం అందించినట్లవుతుంది’ అంటూ పార్టీ సీనియర్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం, మరికొందరు చర్యలు ఉండాల్సిందేనంటూ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలూ అధిష్టానం పెద్దలకు చెప్పి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి వెళ్లడాన్ని బట్టి చూస్తే, అధికార పార్టీలో గళం విప్పిన నేతలపై వేటుకు రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.

గడిచిన వారం, పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, కొందరిపై కఠినమైన చర్యలుంటాయని ప్రచారం జరుగుతుండడం లాంటి ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ, ఏఐసీసీ పెద్దల అభిప్రాయం ఏముంటుందో అన్నది ప్రస్తుతానికి సందిగ్ధంగానే ఉంది. వేటు వేస్తే గనుక.. మంత్రి కొండాతో పాటు మరో ఇద్దరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. లేదంటే, పదవి నుంచి తప్పించి మంత్రివర్గ ప్రక్షాళనకు పూనుకునే అవకాశం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై అంతుచిక్కని విధంగా అంచనాలు, విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

హైకమాండ్‌ నిర్ణయంపై ఉత్కంఠ..

ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఈ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గత కొన్ని రోజులుగా హాట్‌ టాపిక్‌గా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి కొండా సురేఖ సైతం ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న వార్తలు వినవస్తున్నాయి. ఓ వైపు పార్టీలో, మరోవైపు ప్రభుత్వంలో తాజా అలజడిపై ఢిల్లీ పెద్దలను కలిసి వివరణ ఇచ్చుకునే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులతో సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో పాటు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల వైఖరిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. పార్టీ నిబంధనలను అతిక్రమించడం, పార్టీకి భంగం కలిగించేలా ప్రవర్తించిన వీరిని పదవుల నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం రేవంత్‌ వ్యూహాత్మక మౌనం..

ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కుమార్తె అనుచిత వ్యాఖ్యలు, విమర్శలను కొండా సురేఖ దంపతులు ఖండించలేదు. కుమార్తెకు నచ్చజెప్పే ప్రయత్నానికి బదులుగా తాము సుస్మితను ఎలా నియంత్రిస్తామంటూ కొండా మురళీ చేసిన చేసిన వ్యాఖ్యలు హీట్‌ మరింత పెంచాయి. సుస్మిత ప్లాన్‌ ఏలో భాగంగా ఇలా కామెంట్‌ చేసి ఉండొచ్చునని, ప్లాన్‌ బీ ఏంటో తమకు తెలియదన్నారు. ఇంత జరిగినా పార్టీ నుంచి తీవ్ర విరమ్శలు వచ్చినా కొండా దంపతులు సుస్మిత వ్యాఖ్యలను తప్పుపట్టలేదు, కనీసం ఖండించకపోవడం సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలకు కోపాన్ని తెప్పించిందని పార్టీకి చెందిన ముఖ్య నేతలు కొందరు చెబుతున్నారు.

దీంతో మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించాలని, క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను సైతం ఆయన అధిష్ఠానం వద్ద ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొత్తవారికి అవకాశం కల్పించడం లేదా మంత్రివర్గ విస్తరణ ప్రక్రియకు కొంత సమయం పట్టినా, సురేఖ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని పార్టీ నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో కూడా సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే చర్చించారు. అందుకే నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు సురేఖపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సడలింపు నిమిత్తం ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇన్‌ఛార్జి నుండి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది.

కొండా సురేఖ తరఫున కొందరు సీనియర్లు అధిష్టానం పెద్దలతో మంతనాలు జరిపిన నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తప్ప, కొండా సురేఖను మంత్రివర్గం నుండి వేటు వేయడం దాదాపు ఖాయంగా మారనుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నారు. డిసెంబర్‌లో తలపెట్టిన ‘రైజింగ్‌ తెలంగాణ-2’ పెట్టుబడుల సదస్సుతో పాటు విజయవాడ, హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తదితరులతో సమావేశమై చర్చించనున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో పాటు వరంగల్‌ మామునూరు విమానాశ్రయం పనుల అభివృద్ధి పురోగతిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడిని కూడా కలవనున్నట్లు సమాచారం. రక్షణ రంగానికి సంబంధించిన పెట్టుబడులపై చర్చించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ సీఎం సమావేశం కానున్నారు. డిసెంబరు 7 నుండి 9 తేదీల్లో ఫ్యూచర్సిటీ వేదికగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ సదస్సులో పలు డిఫెన్స్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలను ఎఐసీసీ పెద్దలకు వివరించి ముందుకు సాగనున్నారు. ఇదంతా బయటకు తెలిసిన అధికారిక షెడ్యూల్‌ మాత్రమే అయినప్పటికీ, అంతర్గతంగా పొలిటికల్‌ షెడ్యూల్‌ పకడ్భందీగా, వ్యూహాత్మకంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.