నకిరేకల్‌కు రేపు సీఎం రేవంత్‌రెడ్డి..

  • రూ.314 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
  • పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
  • సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌కు రాక..
    • రాజీవ్‌గాంధీ స్టేడియంలో భారీ బహిరంగ సభ

నకిరేకల్‌, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నకిరేకల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌కు చేరుకోనున్న సీఎం.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం రాజీవ్‌గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా మునిపంపుల గ్రామంలో రూ.3.62 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 1×5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌, 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లు, కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కేతేపల్లి మండలం గుడివాడలో రూ.2.74 కోట్లతో నిర్మించిన 1×5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌తో కూడిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌, 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లను ప్రారంభించనున్నారు.

విద్యారంగానికి సంబంధించి నకిరేకల్‌ నియోజకవర్గంలో రూ.9.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. నకిరేకల్‌ మండలం కడపర్తి గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. నకిరేకల్‌ మండలంలో రూ.20 కోట్లతో నిర్మించనున్న సమీకృత మండల స్థాయి కార్యాలయాల సముదాయానికి సైతం శంకుస్థాపన చేయనున్నారు.

రోడ్ల అభివృద్ధికి రూ.45.60 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. నకిరేకల్‌–గురజాల రోడ్డు నుంచి బైరౌనిబండ వరకు, అక్కడి నుంచి అమ్మనబోలు–రామాంజాపూర్‌ రోడ్డు వరకు రహదారి అభివృద్ధి పనులతోపాటు అమ్మనబోలు–రామాంజాపూర్‌ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి.

నకిరేకల్‌లో రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అదే ప్రాంతంలో రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మొత్తం మీద విద్య, వైద్యం, విద్యుత్‌, రహదారులు, పరిపాలన రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.

అనంతరం రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.