సికింద్రాబాద్‌ శ్రీ గణేష్‌ దేవాలయ ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

ఆహ్వాన పత్రిక అందజేసిన దేవాదాయ శాఖ కమిషనర్‌, ఎమ్మెల్యే శ్రీగణేష్‌
సీఎంకు వేదాశీర్వచనం.. తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేత

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ గణేష్‌ దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేసి, ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని సీఎం స్వీకరించారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని సీఎంకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్‌ సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.