ఆదిలాబాద్‌, మామునూరు ఎయిర్‌పోర్టులపై కేంద్ర మంత్రితో సీఎం భేటీ

  • మామునూరు టెండర్లు రెండు వారాల్లో

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌, వరంగల్‌ మామునూరు విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడును కోరారు. ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రితో సీఎం సమావేశమై రాష్ట్రంలోని విమానాశ్రయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

మామునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పూర్తి

మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి భూమిని అందుబాటులోకి తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఇక నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు.. మామునూరు విమానాశ్రయానికి రెండు వారాల్లో టెండర్లు పిలిచి, డిసెంబర్‌ నాటికి ప్రక్రియను ఖరారు చేస్తామని తెలిపారు. అదే నెలలో పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టులో కార్గో, ఎంఆర్‌వో సదుపాయాలు

ఆదిలాబాద్‌ విమానాశ్రయాన్ని కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం చేయకుండా కార్గో, ప్యాసింజర్‌ టెర్మినల్‌, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవర్‌హాలింగ్‌) సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. అదేవిధంగా ఆదిలాబాద్‌ విమానాశ్రయంలో రన్‌వేను ఖరారు చేసే అంశంపై రక్షణ, పౌర విమానయాన శాఖల మధ్య సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.

హెలీ టూరిజంపై సీఎం ప్రత్యేక దృష్టి

తెలంగాణలో హెలికాప్టర్‌ సేవల ద్వారా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా హెలీ టూరిజంకు ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.హెలీ టూరిజం అందుబాటులోకి వస్తే తెలంగాణలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్‌లో సీ-ప్లేన్‌ ల్యాండింగ్‌ అవకాశాలపై అధ్యయనం జరుగుతున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు.సీ-ప్లేన్‌ సేవలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

విమానయాన మౌలిక వసతులపై కేంద్రంతో సమన్వయం

తెలంగాణలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధితో పాటు ఇప్పటికే ఉన్న విమానయాన మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం నుంచి సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, సురేశ్‌ షెట్కార్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌) హర్కార వేణుగోపాలరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.