ఉత్సవాలపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ముందుగానే అధికారులకు అందించాలని కోరారు. ముందస్తు సమాచారం ఉంటే పోలీస్, మున్సిపల్ శాఖలు ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, ఇతర ఏర్పాట్లను మరింత సమర్థంగా చేపట్టగలవని తెలిపారు.ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
