AP | ‘తల్లికి వందనం’ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి..
విద్యకు భరోసా.. ‘తల్లికి వందనం’కు ప్రశంసలు
AP | రంపచోడవరం (పోలవరం జిల్లా ) ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రంపచోడవరం చేరుకున్నారు. ప్రభుత్వ హైస్కూల్–జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్‌తో పాటు ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులు కూడా ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలిసి సరస్వతి దేవి, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పథకం నిధులు వారి ఖాతాల్లో జమయ్యాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన తల్లులు తమ మొబైల్ ఫోన్లకు వచ్చిన నగదు జమ సందేశాలను ముఖ్యమంత్రికి చూపించారు.

ఈ పథకం ద్వారా అందిన ఆర్థిక సాయంతో తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించగలుగుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పథకం ప్రయోజనం అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా నిధులు జమ కావడంతో సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో పంచుకున్నారు.
లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం అందిస్తున్న నిధులను పిల్లల విద్య కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
