కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
అమరావతి, ఆంధ్రప్రభ : మొంథా తుపాను తీవ్రతను పసిగట్టిన ఏపీ సీఎం పునరావాస కేంద్రాలపై ఫోకస్(Focus) పెట్టారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఆదేశాలు ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు.
‘రాష్ట్రంపై మొంథా తుపాను(Montha Storm) ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుపాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నాం. సముద్రతీర(Seaside) ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాం.’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ సరఫరా(Power Supply), రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
ప్రధాని మోదీ ఆరా తీశారు
తుపాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారన్నారు. మొంథా తుపాన్ ప్రస్తుతం కాకినాడ(Kakinada) వైపు దూసుకొస్తుంది.
ఈ ప్రభావంతో ఈరోజు, రేపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఇక తీర ప్రాంతాల్లో పరిస్థితి గంట గంటకు మారుతుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం(Machilipatnam), కళింగపట్నం మధ్య తీరం దాటనుంది ముంథా. తుపాను ప్రభావంతో తీరం వెంట ఈదురుగాలుల తీవ్రత పెరుగుతూ ఉంది.
పలు తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మెుంథా తుపాను ప్రభావం ముదలై విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు జలాశయాల వద్ద హై అలర్ట్(High Alert) ప్రకటించారు.

