16న ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు
కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ.. ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఈ నెల 16న ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో దేవస్థాన అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం దేవస్థానం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, దర్శన ఏర్పాట్లు, ఇతర అవసరమైన చర్యలపై అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, డీసీపీలు సరిత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
