CM Chandrababu Review | విశాఖ భాగస్వామ్య సదస్సుపై సీఎం రివ్యూ!

అమరావతి, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 సన్నాహక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ.సాయిప్రసాద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశాఖ సదస్సుకు సన్నాహకంగా రాష్ట్రంలోని ఐదు ప్రధాన ప్రాంతాలైన విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం తిరుపతిలలో రీజినల్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, అక్కడ లభ్యమయ్యే పెట్టుబడి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చర్చలు జరపాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈ రీజినల్ కాన్ఫరెన్సుల ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. భాగస్వామ్య సదస్సు అనేది కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తినింపేలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరిగేలా ఉండాలని పేర్కొన్నారు. పెట్టుబడులతో పాటు ఇతర కీలక రంగాలు, అంశాలపైనా ఈ సదస్సులో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.22.57 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. వీటిలో రూ.16.6 లక్షల కోట్ల విలువైన 473 ప్రాజెక్టులు కార్యాచరణ రూపం దాల్చగా, కన్వర్ట్ అయిన ప్రాజెక్టులలో ఇప్పటికే 247 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ కూడా పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు.