AP CM| 3లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం భూమిపూజ…

AP CM| 3లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం భూమిపూజ…

దేశంలోనే తొలిసారిగా 177 ఇళ్లతో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ పైలట్‌ ప్రాజెక్టు


AP CM| బుర్రిపాలెం, అక్టోబర్‌ 4 (ఆంధ్రప్రభ): పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–గ్రామీణ్‌ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇదే కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ ఇళ్ల పైలట్‌ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు.

బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికతతో మొత్తం 177 ఇళ్లను నిర్మించనున్నారు. సుమారు రూ.14 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రూర్కీలోని సీఎస్‌ఐఆర్‌–సీబీఆర్‌ఐ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేయనున్నాయి. ఈ సాంకేతికత ద్వారా నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు శ్రమ, నిర్మాణ వ్యర్థాలను తగ్గించి నాణ్యత, పటిష్ఠతను పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం భారీగా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు పీఎంఏవై–గ్రామీణ్‌ 2.0 కింద మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వీటి నిర్మాణ పనులను వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే మార్చి నాటికి మరో 4.20 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత రూపకల్పనకు అనుగుణంగా కాంక్రీట్‌ను పొరలుగా అమర్చి నిర్మాణాన్ని చేపడతారు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే నిర్మాణ సమయాన్ని తగ్గించడం, మానవ శ్రమను తగ్గించడం, నిర్మాణ వ్యర్థాలను నియంత్రించడం ఈ సాంకేతికతలో ప్రధాన ప్రయోజనాలుగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్‌లో పేదల గృహ నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించే అవకాశాలు ఏర్పడనున్నాయి.