AP CM | అండగా ఉంటామని భరోసా..!
AP CM | అండగా ఉంటామని భరోసా..!
ధైర్యంగా ఉండాలని తల్లికి సూచన
నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ
మరో విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ మాట్లాడిన సీఎం
AP CM | అమరావతి, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్మాది దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అండగా నిలిచారు. బాధిత విద్యార్థిని తల్లితో సీఎం టెలిఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థినిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు.
నిందితుడికి కఠిన శిక్ష..
ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు బాధితురాలి తల్లికి స్పష్టం చేశారు. ధైర్యంగా ఉండాలని, విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
వైద్యంపై ఆరా.. అధికారులకు ఆదేశాలు
మరోవైపు విద్యార్థినికి అందుతున్న వైద్య సహాయంపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడిలో గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
