ఆరేళ్లుగా మూత.. శిథిలావస్థకు చేరిన అప్పాజీపేట వసతి గృహం

  • గురుకులాల ప్రభావం.. కరోనా దెబ్బతో తగ్గిన విద్యార్థుల సంఖ్య
  • తలుపులు, కిటికీలు, విద్యుత్‌ సామగ్రి మాయం.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
  • హాస్టల్‌ను పునఃప్రారంభించండి.. లేదంటే పీహెచ్‌సీ లేదా ప్రభుత్వ కార్యాలయంగా మార్చండి

నల్లగొండ మండలం, నవంబర్ 3 (ఆంధ్రప్రభ): ఒకప్పుడు విద్యార్థుల కిలకిలరావాలతో, పచ్చని మొక్కలతో కళకళలాడిన ప్రభుత్వ భవనం నేడు శిథిలావస్థకు చేరింది. విద్యార్థులకు వసతి, విద్యా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎస్సీ బాలుర వసతి గృహం నిరుపయోగంగా మారింది. ఆరేళ్లుగా తాళం వేసి ఉండటంతో భవనం శిథిలమవుతోంది. మరోవైపు దుండగుల ధ్వంసకాండకు గురవుతూ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ మండలం అప్పాజీపేటలోని ఈ హాస్టల్‌ దుస్థితిపై అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని గ్రామస్థులు మండిపడుతున్నారు.

2011లో అందుబాటులోకి..
అప్పాజీపేట గ్రామంలో గతంలో విద్యార్థుల కోసం నిర్వహించిన వసతి గృహం అద్దె భవనంలో ఉండేది. ఈ సమస్యను అప్పటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బీఆర్‌జీఎఫ్‌ 2009-10 నిధుల కింద కోట్ల రూపాయలు మంజూరు చేయించి, ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మింపజేశారు. దీంతో 2011లో ఈ హాస్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ఎంతో విశాలమైన భవనం, అవసరమైన సౌకర్యాలతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు.

వార్డెన్‌ ముజఫరుద్దీన్‌ హయాంలో పచ్చదనం
నూతన హాస్టల్‌ ప్రారంభం నుంచి వార్డెన్‌గా పనిచేసిన ముజఫరుద్దీన్‌ భవనాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించేవారని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ చదువుతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా హాస్టల్‌ ఆవరణలో 110 మొక్కలు నాటించారు. వాటిలో 104 మొక్కలను సంరక్షించి పచ్చదనంతో నింపారు. స్వయంగా మోటారు ఏర్పాటు చేసి మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేవారు. దీంతో హాస్టల్‌ ఆవరణ పచ్చని వనంలా మారింది. అయితే ముజఫరుద్దీన్‌ పదవీ విరమణ తర్వాత హాస్టల్‌ నిర్వహణపై శ్రద్ధ తగ్గిందనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది.

గురుకులాల ప్రభావం.. కరోనా దెబ్బ!
హాస్టల్‌ మూతపడటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో విద్యార్థులు వాటిలో చేరేందుకు ఆసక్తి చూపారు. సాధారణ వసతి గృహాలతో పోలిస్తే గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండటంతో అప్పాజీపేట హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. 2020లో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఇతర విద్యాసంస్థల మాదిరిగానే ఈ వసతి గృహం కూడా మూతపడింది. కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారులు హాస్టల్‌ను తిరిగి ప్రారంభించలేదని గ్రామస్థులు చెబుతున్నారు. విద్యార్థులు లేరనే కారణంతో భవనాన్ని నిరుపయోగంగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆరేళ్లుగా తాళం.. దొంగల చేతికి చిక్కిన సామగ్రి!
దాదాపు ఆరేళ్లుగా తాళం వేసి ఉండటంతో భవనం క్రమంగా శిథిలావస్థకు చేరుతోంది. ప్రధాన గేటు ధ్వంసం కాగా, తలుపులు, కిటికీలు, బీడాలు దెబ్బతిన్నాయి. బోరు మోటారు పైపులు, నల్లాలు, విద్యుత్‌ వైర్లు, ఫ్యాన్లు, స్టీల్‌ సామగ్రి తదితర వస్తువులు చోరీకి గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవనం లోపల చెత్తాచెదారం పేరుకుపోయి నోటీసు బోర్డులు సైతం నిరుపయోగంగా మారాయి. హరితహారం కింద నాటిన మొక్కల్లో కొన్ని నీటి వసతి లేక ఎండిపోతున్నాయి. రాత్రివేళల్లో కొందరు తాగుబోతులు, జూదరులకు ఈ భవనం అడ్డాగా మారుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరో ప్రభుత్వ అవసరానికి వినియోగించండి!
అప్పాజీపేట జనాభా పరంగా పెద్ద గ్రామపంచాయతీ. చుట్టుపక్కల పది గ్రామాలకు ఇది కేంద్రంగా ఉంది. భవిష్యత్తులో అప్పాజీపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కూడా ఉంది. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న గ్రామంలో కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ భవనం నిరుపయోగంగా ఉండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయం లేదా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. తద్వారా ప్రజాధనం వృథా కాకుండా భవనాన్ని ప్రజా అవసరాలకు వినియోగించవచ్చని సూచిస్తున్నారు.


కలెక్టర్‌, అధికారులు స్పందించాలి!
జిల్లా కలెక్టర్‌, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవనాన్ని మరింత శిథిలావస్థకు చేరకుండా కాపాడటంతో పాటు తగిన ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గం, స్థానిక నాయకులు, యువత కూడా ఈ అంశంపై చొరవ తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.