స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం

స్వచ్ఛ ఆంధ్ర సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకం: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ

వినుకొండ, ఆంధ్రప్రభ : పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. స్వచ్ఛతా హి సేవా-2026 కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర, ఏక్‌ దిన్‌, ఏక్‌ ఘంటా, ఏక్‌ సాత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో స్వచ్ఛతపై చైతన్యం కల్పించేందుకు స్వయంగా చీపురు పట్టుకుని వీధులను శుభ్రం చేశారు. రహదారులు, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు.

ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీవీ సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని కోరారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలతో అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. ప్రజలు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే వినుకొండను మరింత పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్‌ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొని శ్రమదానం చేశారు.