CJP Protest | బెంగళూరు నిరసనలో సినీనటుడు ప్రకాష్ రాజ్

బెంగళూరు, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నిర్వహించిన ‘ప్రజా న్యాయస్థానం’ కార్యక్రమం బెంగళూరులో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్, ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ పాల్గొన్నారు. గురువారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘సర్‌ రద్దు చేయండి’, ‘జ్ఞానేష్ కుమార్ పదవిని వదిలేయండి’ అంటూ నినాదాలతో ఫ్రీడమ్ పార్క్ పరిసరాలు మార్మోగాయి. గురువారం ఉదయం నుంచే కార్యకర్తలు, ప్రజలు ఫ్రీడమ్ పార్క్‌కు చేరుకోవడంతో నిరసన ప్రాంగణంలో జనసందడి క్రమంగా పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీజేపీ నాయకులు అభిజీత్ దిప్‌కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అక్కడికి చేరుకున్నారు. అనంతరం ధృవ్ రాఠీ, ప్రకాష్ రాజ్‌లతో కలిసి వారు వేదికపై చేతులు పైకెత్తగా.. అక్కడున్న ప్రజలు ‘ఓటు దొంగ.. ఓటు దొంగ’ అంటూ నినాదాలు చేశారు.

‘ప్రభుత్వమే ఎవరు ఓటు వేయాలో నిర్ణయిస్తోంది’

ప్రజా న్యాయస్థానం కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. సర్‌ ప్రక్రియపై తీవ్ర విమర్శలు చేశారు. సర్‌ ద్వారా ఎన్నికల సంఘం దేశ ప్రజలను అవమానించిందని ఆయన ఆరోపించారు. “ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో ప్రజలే నిర్ణయించేవారు. కానీ సర్‌ ద్వారా ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోంది” అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

సర్‌ ప్రక్రియ కారణంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ఆరోపిస్తూ.. ఈ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పౌరుల ఓటు హక్కును కాపాడటమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ నిరసన కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌కు పరిమితం కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. “సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెళ్లిపోతే ఆ స్థానంలో మరొకరు వస్తారు. కానీ మా అసలు లక్ష్యం సర్‌ ప్రక్రియను రద్దు చేయడం” అని ఆయన పేర్కొన్నారు.