delhi| సీజేపీ నేత అశుతోష్ రంకా
సీజేపీ నేత అశుతోష్ రంకా
ఢిల్లీ పోలీసులకు సీజేపీ నేతల విజ్ఞప్తి
- 24 గంటల్లో నిరసనకు సిద్ధం
- శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు: సౌరవ్ దాస్
ఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి కోరుతూ సీజేపీ (CJP) నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. నిరసన నిర్వహించేందుకు అనువైన తేదీని ప్రకటించాలని ఢిల్లీ పోలీసులను కోరారు. అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే నిర్దేశిత నిరసన ప్రదేశానికి చేరుకుని ఆందోళన చేపడతామని సీజేపీ నేత అశుతోష్ రంకా తెలిపారు.
నిరసనకు తేదీ ప్రకటించండి
జంతర్ మంతర్ వంటి నిర్దేశిత ప్రదేశంలో నిరసన చేపట్టేందుకు అభ్యంతరం ఏమిటని అశుతోష్ రంకా ప్రశ్నించారు. ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు తమతో చర్చించాలని కోరారు. నగరవ్యాప్తంగా ఆంక్షలు విధించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, దుకాణాలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. పండుగల సీజన్‌లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా, నిర్దేశిత ప్రదేశంలో నిరసనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సీజేపీ సహ వ్యవస్థాపకుడు సౌరవ్ దాస్ పేర్కొన్నారు. నిరసన నిర్వహించేందుకు పది రోజుల ముందుగా పోలీసులను సంప్రదించాలని వారు సాధారణంగా చెబుతుంటారని గుర్తుచేశారు. ఈసారి నిరసనకు తేదీ, సమయాన్ని పోలీసులే నిర్ణయించాలని కోరుతున్నట్లు తెలిపారు. అయితే, ఈ అంశాన్ని నిరవధికంగా పెండింగ్‌లో ఉంచేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. నిరసనకు అనుమతి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు పోలీసులకు 24 గంటల గడువు ఇస్తామని వెల్లడించారు. పోలీసుల స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
