సమ్మె హక్కును తాకట్టు పెట్టారు..
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి
గోదావరిఖని, ఆంధ్రప్రభ: సింగరేణి బొగ్గు పరిశ్రమ కార్మికుల ప్రధాన హక్కైన సమ్మెను సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యానికి తాకట్టు పెట్టిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి ఆరోపించారు. గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ కార్మికుల హక్కులను కాపాడాల్సింది పోయి.. సమ్మె చేయాలంటూ కంపెనీ యాజమాన్యానికే లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతోందని రాజిరెడ్డి తెలిపారు. బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడి సొంతింటి కలను సాకారం చేయడానికి తమ సంఘం ముందుండి ఉద్యమిస్తుందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో యాజమాన్యంతో రాజీపడకుండా హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సింగరేణిలో కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సంస్థ పరిధిలోని పలు ఆసుపత్రుల్లో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని అన్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా సింగరేణి ఆసుపత్రులను ఆధునీకరించాలని కోరారు. అవసరమైన వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అలాగే సింగరేణి పరిధిలోని ప్రతి ఏరియాలో సీబీఎస్‌ఈ పాఠశాలలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు సంస్థ మరింత బాధ్యత తీసుకోవాలని అన్నారు. విద్య, వైద్యం, నివాసం వంటి మౌలిక అవసరాల విషయంలో కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందన్నారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో మాత్రమే ఐక్య పోరాటాల పేరుతో నినాదాలు చేస్తుందని రాజిరెడ్డి విమర్శించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్మికుల సమస్యలపై అదే స్థాయిలో పోరాటం చేయడం లేదని ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో గుర్తింపు సంఘం తన బాధ్యతను గుర్తించాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో సీఐటీయూ నాయకులు మండే శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, ఆర్. శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
