శిరీష ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
ములకలపల్లి, ఆంధ్రప్రభ: నర్సు ఊకే శిరీషపై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఐటీయూ మండల కన్వీనర్ నిమ్మల మధు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం ములకలపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల మధు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు, ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. ఊకే శిరీష ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఊకే శిరీష కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్న యువతిపై జరిగిన ఘటనను సమాజం తీవ్రంగా ఖండించాలని నిమ్మల మధు పిలుపునిచ్చారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి పాయం అమల, సీఐటీయూ నాయకులు దుబ్బ ధనలక్ష్మి, ప్రియాంక, పొన్నారి, సీత, వెంకట రమణ, రమాదేవి, ఈశ్వరి, అనిత, కీసరి జయ, సుజాత, కొర్రి పద్మ, మీనా, పావని, లాల్‌బీ, శైలజ, జ్యోతి, నాగమణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
