Saturday, November 23, 2024

Aattam | రీమేక్… అయితే ఏం అవిష్క‌ర‌ణ అద్భుతం….

ద‌క్షిణాది పరిశ్ర‌మ నుంచి కాన్సెప్ట్ ఆధారంగా సినిమాలు చేసే ఒకే ఒక్క ప‌రిశ్ర‌మ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ. ప్ర‌యోగాలు అక్క‌డ కొత్త కాదు. నిరంత‌రం ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు వ‌స్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు సైతం అలాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించ‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. క‌థ న‌చ్చితే పాత్ర‌తో సంబంధం లేకుండా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేస్తారు. అందుకే మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ అవార్డుల ప‌రిశ్ర‌మ‌గా పేరు గాంచింది.

ఏటా విడుద‌ల చేసే జాతీయ అవార్డుల్లో అగ్ర స్థానం వాళ్ల‌దే అన‌డంలో అతి శ‌యోక్తి లేదు. క‌థ‌లో సందేశం..పాత్ర‌ల్లో వాస్త‌విక‌త‌..ప్ర‌తీది మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల నుంచి మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీని వేరు చేస్తోంది. తాజాగా 70వ జాతీయ అవార్డు వేడుక‌ల్లో ఆట్టం ఉత్త‌మ జాతీయ చిత్రంగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈసినిమా జాతీయ అవార్డుల‌కంటే ముందే వివిధ అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పైనా మెరిసింది.

ది ఇండియ‌న్ ఫిల్మ్ పెస్టివ‌ల్ ఆఫ్ లాస్ ఎంజెల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ కేర‌ళ వేదిక‌ల‌పై ఆట్టం ప్ర‌ద‌ర్శించారు. 1954 లో వ‌చ్చిన 12 యాంగ్రీమెన్ హాలీవుడ్ టెలివిజ‌న్ కార్య‌క్ర‌మం ఆధారంగా దీన్ని రూపొందించారు.

ఈ సినిమా క‌థేంటి అంటే? కేర‌ళ‌లో ఓ నాట‌క బృదం. అందులో 12 మంది. అంతా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారే. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వీధి నాట‌కాలు వేస్తుంటారు. వీళ్ల నాట‌కాన్ని మెచ్చిన ఓ విదేశీ బృందం త‌మ రిసార్స్ట్ లో అతిధ్యం ఇస్తుంది. ఈ సంద‌ర్భంగా అంతా మ‌త్తులో తేలుతుంటారు.

అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి అంజలి నిద్రపోతున్న కిటికీ పక్కకు వచ్చి అందులోంచి చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోతాడు. ఈ 12 మందిలో ఆమెతో అలా తప్పుగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? అంజలి ఈ విషయాన్ని ఎలా బయటపెట్టింది? చివరకు ఆ అసభ్యకర పని చేసిన వ్యక్తిని గుర్తించారా? అన్నది కథ.

- Advertisement -

మనిషి.. వ్యక్తిత్వం..

‘నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు.. ఎవ్వరూ నిన్ను చూడటం లేదని తెలిసినప్పుడు.. నువ్వెంటో అది నీ క్యారెక్టర్‌’ – ఓ చిత్రంలో హీరోయిన్‌తో కథానాయకుడు పలికే డైలాగ్‌. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఎక్కువ మందిలో రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. పైకి అందరితోనూ మంచిగా ఉంటూనే సమయాన్ని బట్టి ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటారు.

తాము మనుగడ సాగించడానికి ఎదుటివారిని ఎంతకైనా దిగజార్చి చూపిస్తారు. కోరికలు, అవసరాలు, ఆశల వెంట పరిగెడుతూ ఎదుటి వ్యక్తిని బలి పశువును చేయడమే వాళ్లకు తెలుసు. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి వ్యక్తులకు ఇచ్చే గౌరవం, విలువలు మారిపోతాయి. అందుకు దృశ్య రూపమే ఈ ‘ఆట్టం.

అందరూ జీవించేశారు…

‘ఆట్టం’లో ఒక్కరు కూడా తెలుగువారికి తెలిసిన నటులు కాదు. కానీ, ఆ పాత్రల్లో వాళ్లను తప్ప వేరొకరిని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరూ జీవించారు. సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా తీశారు. చాలా చిన్న కాన్సెప్ట్‌ను ఎంచుకుని మనిషి నైజాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. అందుకే జాతీయ అవార్డు వ‌రించింది.

ఏ ఓటీటీటీలో …

ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో కేవలం మలయాళ భాషలో, తెలుగు సబ్‌టైటిల్స్‌తో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement