Friday, November 22, 2024

ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు..

ఆర్ ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై రాజమౌళి బృందానికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. నాటు నాటుకు ఆస్కార్‌తో భారత్‌ గర్వపడుతోందని చెప్పారు. కీరవాణి, చంద్రబోస్‌ను అభినందించారు. ఈ పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుందన్నారు. నాటు నాటు పాటను ఏండ్ల తరబడి స్మరించుకుంటారని చెప్పారు.

గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై శుభాకాంక్ష‌లు..

ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్‌తో భారతీయులు, తెలుగు సినిమా గర్వించేలా చేశారని అన్నారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ట్విట్ చేశారు..

తెలుగు పాట‌కు అంత‌ర్జాతీయ గౌర‌వం – కెసిఆర్
‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు. నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట తెలంగాణ‌ రచయిత, చంద్రబోస్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి , కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి , గాయకులు రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ , నటులు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

అంత‌ర్జాతీయ వేదిక‌పై తెలుగు జెండా రెప‌రెప‌లు – జ‌గ‌న్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా అస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు.. తెలుగుజెండా ఎగురుతోందని అన్నారు. మన తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు ఈ ఘన విజయానికి అర్హులని అన్నారు. వీరితో పాటు పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.

నాటు నాటు టీమ్ కు వెంకయ్య నాయుడు ప్ర‌శంస‌లు

ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవ‌డం పట్ల మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు హ‌ర్షం వ్య‌క్తంచేశారు.. రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ ల ప్రతిభ ద్వారా తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్ని ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు గీతం ఆస్కార్ అందుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

చ‌రిత్ర‌లో నిలిచిపోయే సాంగ్ నాటు నాటు – చంద్ర‌బాబు
ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవ‌డం పట్ల ఎపి మాజీ ముఖ్య‌మంత్రి ,టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆనందం వ్య‌క్తం చేశారు…. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను కైవసం చేసుకోవడం ద్వారా ‘నాటునాటు’ పాట చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక గొప్ప సందర్భమని… ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. ఈ మేర‌కు రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ లకు ట్వీట్ ద్వారా అభినంద‌న‌లు తెలిపారు..

మ‌రెన్నో అవార్డుల‌కు ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్ఫూర్తి – ప‌వ‌న్ క‌ల్యాణ్
భారతీయులు గర్విస్తున్న క్షణాలివని పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు ఈ అవార్డు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు

కొత్త చరిత్ర సృష్టించిన కీర‌వాణి, చంద్ర‌బోస్ – కెటిఆర్
నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై మంత్రి కేటీఆర్ సైతం తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తం చేశారు.
‘‘ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ దక్కించుకున్న గౌరవాన్ని బిలియన్ భారతీయులతో కలిసి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఎంఎం కీరవాణి గారూ.. లిరిసిస్ట్ బోస్‌ గారు చరిత్ర సృష్టించారు. అద్భుతమైన స్టోరీ టెల్లర్, ది మ్యాన్ ఆఫ్ దిమూమెంట్ ఎస్ఎస్ రాజమౌళి గారూ భారతదేశం గర్వపడేలా చేశారు. ఇక సూపర్ స్టార్స్ అయిన నా సోదరులిద్దరూ ఎన్టీఆర్, రామ్ చరణ్ అదరగొట్టేశారు. నాటు నాటు సాంగ్‌కి సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందిస్తున్నా. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులందరికీ నమస్కారం. ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్‌ను గెలుచుకుని.. అద్భుతమైన విజయం సాధించినందుకు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బృందానికి నా అభినందనలు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

విశ్వవ్యాప్తమైన తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి: మంత్రి తలసాని
ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హర్షం వ్యక్తంచేశారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నటులు జూనియర్ ఎన్టీఆర్‌, రాంచరణ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర‌చ‌యిత‌ చంద్రబోస్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు సంస్కృతి విశ్వ‌వ్యాప్తం – సోము వీర్రాజు
తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డును అందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఎపి బిజెపి శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజు. . ‘‘తెలుగు వెండి తెరకు పండుగ రోజుగా నా ఛాతి ఉప్పొంగుతోంది’’ అని అన్నారు. ‘నాటు నాటు’ పాట.. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అందుకోవడం , తెలుగు సంస్కృతి విశ్వవ్యాప్తం అయిందని పేర్కొన్నారు.

మ‌రిచిపోలేని మ‌ధుర జ్ఞాప‌కం …బండి సంజ‌య్

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాట కు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement