తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. సినీరంగంపై కరోనా తీవ్రప్రభావం చూపించింది. థియేటర్ల మూతపడి, నిర్మాణంలోనే నిలిచిపోయినందున చిత్రాలకు భారి ఆర్థిక నష్టాన్ని వాటిల్లింది. దీనివల్ల సినిమాల విడుదల సంఖ్య కూడా చాలా తగ్గింది. మధ్యలో కొన్ని సినిమాలు ఓటీటీలో కూడా విడుదలయ్యాయి. కాగా, కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతొ తిరిగి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మళ్లీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారు. భారీ చిత్రాల విడుదల కావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.
ఈ ఏడాదిలో చాలా మంది కొత్త హీరోయిల్లు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ప్రతిఏడాది తెలుగు సినిమాల్లోకి ఎవరో ఒక కోత్త హీరోయిన్ పరిచయం అయ్యే విషయం తెలిసిందే. కొందరు కేవలం ఒక చిత్రానికే పరిమితం అయితే మరికొందరు మాత్రం మల్లీ మల్లీ ఛాన్స్ దక్కించుకుంటున్నారు. మరోవైపు తెలుగు చిత్రాల్లో నటిస్తున్న బాలీవుడ్ భామలకు కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ ఏడాది కొత్తగా పరిచయమైన కొందరు నాయికల గురించి తెలుసుకుందాం….
కృతి శెట్టి..
నిర్మాణంలో ఉండగానే ఆకర్షించిన సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది బెంళూరి భామ కృతిశెట్టి. బాల్యంలోనే మోడల్‌గా పరిచయం అయింది. దాంతో సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం ద్వారా పరిచయం అవ్వడంతో ఈ సినిమాలో తనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తొలి సినిమా నిర్మాణంలో ఉండగానే కృతికి ఆఫర్లు వచ్చాయి. రెండు సినిమాలు ఒప్పుకుంది. గ్లామర్ పరంగానే కాకుండా నటిగా సైతం తొలి చిత్రంలో మంచి మార్కులు తెచ్చుకోవడంతో కృతికి మంచి భవిష్యత్తు ఉంటుందని సినీవర్గాలు అంటున్నాయి.
శ్రీ లీల..
తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు నటించడం లేదనే విమర్శలకు జవాబుగా అచ్చమైన తెలుగు అమ్మాయి శ్రీలీలకు పెళ్లిసందడి చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆమెను ఎంపికచేశారు. డాక్టర్ చదువుతున్న ఈ అమ్మాయి యాక్టర్ అయింది. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడుతో జోడీ కట్టి పెళ్లిసందడి చిత్రంలో శ్రీలీల నటతో మంచి అభినందనలు అందుకుంది. పాటల్లో చలాకితనం యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లిసందడి ఫలితం నిరాశపరిచినా రవితేజ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చిందని తెలిసింది..
ఫరియా అబ్దుల్లా..
హీరోయిన్ ఇంత హైట్ ఉందేమిటీ? అనిపించుకున్న నటి ఫరియా అబ్దుల్లా. సంచలన విజయం సాధించిన జాతిరత్నాలు చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. థియేటర్ అనుబవం ఉన్న ఫరియా కొన్ని సినిమాల్లో మెరిసింది. కానీ హీరోయిన్‌గా మాత్రం జాతిరత్నాలుతో అరంగేట్రం చేసింది. ఈ పక్కా హైదరాబాదీకి మంచి గుర్తింపు వచ్చింది. సూపర్‌హిట్ సినిమాలో నటించి గుర్తింపు ఉన్నప్పటికీ ఫరియాకు ఆశించిన అవకాశాలు రాకపోవడానికి ఆమె హైట్ కారణం అని కొందరు అంటున్నారు. అయినప్పటికీ బంగార్రాజులో ఓ ప్రత్యేకగీతంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది ఫరియా..
అమ్రిత అయ్యర్..
కొద్ది నెలల క్రితం ”నీలి నీలి ఆకాశం…” అనే పాట బాగా పాపులర్ అయింది. ఆ పాటలో నటించిన హీరో ప్రదీప్ అందరికీ తెలిసిన కుర్రాడు. కానీ హీరోయిన్ అమ్రిత అయ్యర్ మాత్రం కొత్త నటి. సినిమా విడుదల ఆలస్యం అయినా.. వీడియో రూపంలో రిలీజ్ అయిన పాట పాపులర్ కావడంతో అమ్రితకు మంచి గుర్తింపు లబించింది. అయితే బ్యాడ్‌లక్ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు తగిన గుర్తింపురాలేదు.
శివాణి రాజశేఖర్..
ఉత్తరాదిలో హీరోల కుమార్తెలు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. దక్షిణాదిలో ఈ ట్రెండ్ ఇటీవలే మొదలైంది. తెలుగులో పాపులర్ నటీ నటులు డా.రాజశేఖర్, జీవిత కుమార్తె శివాని రాజశేఖర్ ఈ ఏడాది కొత్తగా పరిచయమైన నాయికల్లో ఒకరు. నిజానికి శివాని తొలిచిత్రం ప్రారంభమై ఆగిపోయింది. ఆ తర్వాత ‘అద్భుతం’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ద్వారా శివాని నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాన్ని సినీ ప్రముఖులు వ్యక్తం చేశారు.
ప్రియా వారియర్..
కన్ను గీటుతో ఓవర్ నైట్ పాపులర్ అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన తొలి మళయాల చిత్రం తెలుగులో అనువాదమైంది. కానీ నేరుగా తెలుగులో నటించిన చిత్రం చెక్. నితిన్ కథానాయకుడు. ఆ తర్వాత ఇష్క్ అనే సినిమా సైతం చేసింది. ఈ రెండు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ప్రియా వారియర్‌కు ఆదిలోనే బ్రేక్ పడింది.