Saturday, July 27, 2024

Movies | సెంకండాఫ్‌లో ఇక భారీ సినిమాలదే హ‌వా..

తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఉత్తరాదికి సవాల్‌ విసురుతోంది. బాలీవుడ్‌లో కనిపించని ప్రయోగాలు మన తెలుగు దర్శకులు చేస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలకు క్రియేట్‌ చేస్తున్నారు. అందుకే తెలుగు సినిమా విడుదలవుతోంది అంటే మొత్తం భారతీయ చిత్రపరిశ్రమ ఆసక్తిగా చూస్తోంది. టాలీవుడ్‌ సినిమా స్థాయిని పెంచిన అనేక మంది తెలుగు దర్శకులు ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు తీస్తున్నారు.

తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సూపర్‌హిట్‌తో రాబోయే పాన్‌ ఇండియా సినిమాలపై అందరి దృష్టి నిలిచింది. పాన్‌ ఇండియా సినిమాలుగా తెరకెక్కిన అగ్ర హీరోల సినిమాలన్నీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తొలి ఆరు నెలలు జనవరి మినహా మిగతా నెలల్లో చిన్న సినిమాలదే హవా… కానీ జూలై నుండి బడా సినిమాలు వస్తున్నాయి. పాన్‌ ఇండియా సినిమాల విడుదల తేదీలను కూడా వీకెండ్‌ కలిసి వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రధమార్ధం టాలీవుడ్‌కు సరైన హిట్స్‌ లేకపోవడానికి అగ్రహీరోల సినిమాలు రాకపోవడమే కారణం అని సినీ వాణిజ్య వర్గాలు అంటున్నాయి. దాంతో చిన్న సినిమాలను చూస్తూనే ప్రేక్షకులు సంతృప్తి చెందారు. కానీ సగటు ప్రేక్షకుడు కోరుకునే భారీ బడ్జెట్‌, కాంబినేషన్‌ చిత్రాల రాక జూన్‌ నెలాఖరు కల్కితో ప్రారంభమైంది.

ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె వంటి స్టార్స్‌ నటించిన కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాదిలో కూడా ఈ సినిమా రికార్డులు నెలకొల్పుతోంది. ఈ క్రమంలో రాబోయే పాన్‌ ఇండియా సినిమాలపై మరింత అంచనాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. నెలకు ఒక సినిమా చొప్పున మంచి ప్లానింగ్‌తో వీటిని విడుదల చేస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం….

భారతీయుడు -2 :

కమల్‌ హాసన్‌ – శంకర్‌ కాంబినేషన్‌ చిత్రం అనగానే అంచనాలు అధికంగా ఉంటాయి. విక్రమ్‌తో భారీ విజయం సాధించిన కమల్‌ భారతీయుడు 2 సీక్వెల్‌లో నటిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రిందట విడుదలైన ‘భారతీయుడు ‘ సినిమాకు ఇది సీక్వెల్‌. జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

- Advertisement -

డబుల్‌ ఇస్మార్ట్‌:

దర్శకుడు పూరి జగన్నాథ్‌, హీరో రామ్‌ మంచి సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు వీరి కలయికలో ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా వచ్చింది. దీనికి కొనసాగింపుగా రూపొందుతున్న డబుల్‌ ఇస్మార్ట్‌. రామ్‌, పూరి కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు అధికంగా ఉన్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల అవుతుంది.

దేవర – పార్ట్ 1 :

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత జూ.ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం దేవర. ఇది రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. కొరటా ల శివ దర్శకుడు. సెప్టెంబరులో దేవర ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాను సెప్టెంబరు 27న విడుదలకానుంది.

గేమ్‌ ఛేంజర్‌:

రామ్‌ చరణ్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం గేమ్‌ ఛేంజర్‌. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమాగా పేర్కోవచ్చు. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాని నాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అదే జరిగితే అక్టోబర్‌ 31 నాటికి గేమ్‌ ఛేంజర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

పుష్ప – 2 :

అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందించిన చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక నాయిక. తొలుత ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయాలని అనుకున్నారు. పనులు పూర్తి కాకపోవడంతో డిసెంబరు 6న విడుదల చేస్తున్నారు.

ఇక విక్రమ్‌ నటిస్తున్న తంగలాన్‌, నితిన్‌ నటించిన రాబిన్‌ హుడ్‌, నాగ చైతన్య తండేల్‌ విడుదల తేదీలను ప్రకటించాల్సి ఉంది, నాని నటిస్తున్న సరిపోదా శనివారం ఆగస్టు 29న విడుదలవుతుంది. తమిళ స్టార్‌ విజయ్‌ నటించిన గోట్‌ విడుదల కానుండగా, దసరా సీజన్‌ కోసం అక్టోబర్‌ 10న రజనీకాంత్‌ వెట్ట యాన్‌, సూర్య హీరోగా నటిస్తున్న కంగువా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. రానున్న ఆరు నెలలు తెలుగు, తమిళ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement