Friday, October 18, 2024

Laxman Bhat | పద్మశ్రీ అందుకోకుండానే ప్రముఖ సింగర్‌ కన్నుమూత

ప్రముఖ సంగీత విద్వాంసుడు ద్రుపదాచార్య పండిట్‌ లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌(93) కన్నుమూశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. అవార్డు అందుకోకుండానే పండిట్‌ లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న లక్ష్మణ్‌ భట్‌ జైపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. పండిట్‌ తైలాంగ్‌ కుమార్తె ప్రఖ్యాత ధృపద్‌ గాయని అయిన ప్రొఫెసర్‌ మధు భట్‌ తైలాంగ్‌ ధ్రువీకరించారు.

”గత కొన్ని రోజులుగా పండిట్‌ జీ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించాం. చికిత్స సమయంలోనే ఆయన ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు” అని మీడియాకు తెలిపారు. ఈ వార్త తెలియడంతో సంగీత ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారానికి ధ్రుపదాచార్య పండిట్‌ లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌ ఎంపిక కావడం, మరి కొద్దిరోజుల్లోనే అవార్డును అందుకోవాల్సి ఉంది. ఈ లోపే పండిట్‌ లక్ష్మణ్‌ భట్‌ మరణించడం ఎంతో ఆవేదనకు గురిచేస్తున్నదని అభిమానులతోపాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

ఇక ధ్రుపదాచార్య పండిట్‌ లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌ తన జీవతం మొత్తాన్ని సంగీతానికే అర్పించారు. పండిట్‌ లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌ బనస్థలి విద్యాపీఠ్‌, రాజస్థాన్‌ సంగీత సంస్థలో సంగీత ఉపన్యాసకుడిగా పనిచేశారు. 1985లో జైపూర్‌లో ‘రసమంజరి’ పేరుతో ఒక సంగీతోపాసన కేంద్రాన్ని కూడా స్థాపించారు. అక్కడ ఎందరికో ఉచితంగానే విద్యనందించారు. జైపూర్‌లో అంతర్జాతీయ ధ్రుపద్‌-ధామ్‌ ట్రస్ట్‌ని ఏర్పాటుచేసి పేదలకు సహాయ సహకారాలు అందించారు. ఈ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పండిట్‌ లక్ష్మణ్‌ భట్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement