Friday, November 22, 2024

బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న సౌత్‌ ఇండియన్‌ సినిమాలు..

ఒకప్పుడు దక్షిణాదికి చెందిన హీరోలు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, చిరంజీవి వంటి చాలామంది బాలీవుడ్‌లో అడుగుపెట్టి పెద్దగా సక్సెస్‌ కాలేకపోయారు. నేడు ఆ పరిస్థితి లేదు. దక్షిణాది హీరోలు బాలివుడ్‌, హాలివుడ్‌లో రికార్డులు సృష్టిస్తున్నారు. నిజానికి హిందీ ఇండస్ట్రీ దక్షిణాది హీరోయిన్లను తప్ప ఇంకెవరిని ఎప్పుడూ సహించదు. కాకపోతే తెలుగులో, తమిళ్‌లో హిట్టయిన సినిమా రైట్స్‌ కొని హిందీలో అగ్రతారలను పెట్టుకుని రీమేక్ చేసే ట్రెండ్‌ ఉండేది. అప్పట్లో సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన సింహాసనం ఒక సెన్సెషన్‌. సాంకేతిక విలువలతో ఈ చిత్ర నిర్మాణం జరిగింది. హిందీలో పునర్‌నిర్మించిన సింహాసనం అద్భుత విజయం సాధించింది. బాహుబలితో ఆ ట్రెండ్‌ మారింది. ప్రభాస్ గురించి, రాజమౌళి గురించి బాలివుడ్‌లో అప్పటివరకు ఎవరికీ తెలియదు. పాన్‌ ఇండియా సినిమా బాహుబలి వల్ల హిందీలో అందరికీ తెలిసిపోయారు. అంతే కాదు వారు బాలివుడ్‌, హాలివుడ్‌ అవకాశాలు కూడా చేజిక్కించుకుంటున్నారు. బాహుబలి సెకండ్‌ పార్ట్‌ వసూళ్లు ఏకంగా 1000 కోట్లు దాటింది. ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌ వసూళ్లు కూడా 1000 కోట్లు దాటింది. బాలివుడ్‌లో మునుపెన్నడూ లేని రికార్డులను సౌతిండియన్‌ హీరోలు దక్కించుకుంటున్నారు. ట్రిపుల్‌ ఆర్‌తో రాంచరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ జాతీయస్థాయిలో వెలుగుతున్నారు. కన్నడ హీరో నటించిన కెజిఎఫ్‌ ఫస్ట్‌ పార్ట్‌ హిందీలో మంచి కలెక్షన్‌లను తెచ్చిపెట్టింది. సెకండ్‌ పార్ట్‌ కూడా బాగా బిజినెస్‌ చేసింది. ఈ సినిమాకోసం షాహిద్‌ కపూర్‌ తన జెర్సీ సినిమాను వాయిదా వేసుకున్నాడు.

పుష్ప సినిమా ప్రభంజనం ముందు బాలివుడ్‌లో ఏ సినిమా నిలవడలేక పోయింది. అవును బాలివుడ్‌ మార్కెట్‌కు సౌత్ ఇండియన్‌ సినిమాను అడ్డుకునే స్థితి లేదు. దారులు తెరుస్తోంది. సౌత్‌ ఇండియన్‌ నిర్మాతలు హిందీ బెల్టులో మార్కెటింగ్‌ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నారు. వారికి పట్టు దొరికింది. డబ్బులు ఎలా కూడగట్టుకోవాలో నేర్చేసుకున్నారు. ఓ మోస్తారు సినిమాను హిందీలో డబ్‌ చేసుకుంటున్నారు. తద్వారా శాటిలైట్‌ హక్కులు పొందుతున్నారు. ఈ మధ్య ఓటీటీ ద్వారా కూడ డబ్బులు సంపాదించుకుంటున్నారు. బాహుబలి రెండు పార్ట్‌లలో నటించిన ప్రభాస్‌ సాహోతో బాలివుడ్‌కు దగ్గరయినప్పటికీ రాధే శ్యామ్‌తో డిజాస్టర్‌ మూట గట్టుకున్నాడు. విజయ్‌ నటించి బీస్ట్‌ హిందీలో తన్నేసింది.

ఒక ఆర్‌ఆర్‌ఆర్‌, ఒక కెజిఎఫ్‌, ఒక పుష్ఫ హిట్టవగానే సరిపోదు. మరిన్ని విజయాలు బాలివుడ్‌ ఇండస్ట్రీలో పొందాల్సి ఉంది. సౌతిండియన్‌ సినిమాల్లో మితి మీరిన హీరోయిజం ఉంటుంది. మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇదే మార్గం. సౌత్‌ ఇండియా సినిమాలు హై ఎండ్‌ టెక్నాలజీని అడాప్ట్‌ చేసుకుంటున్నాయి. చిత్రీకరణ పోకడల్లో కొత్త పంథాను తొక్కుతున్నాయి. హిందీలో రజనీకాంత్‌, ఐశ్వర్య నటించిన రోబో దాని సీక్వెల్‌ 2.0 వసూళ్లను దున్నుకున్నాయి. అధిక వసూళ్ల ఇండియన్‌ సినిమాల జాబితాలో 2.0 ఉంది. హిందీ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే సౌత్‌ ఇండియన్‌ సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారన్నమాట. ప్రభాస్‌ చేతిలో ఆదిపురుష్‌ వంటి పెద్ద ప్రాజెక్టులున్నాయి. పెద్ద హీరోల సినిమాలు హిందీలోకి డబ్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement