Saturday, November 23, 2024

RIP – విజ‌య్ కాంత్ మృతికి బాల‌య్య‌, ప‌వ‌న్, క‌మ‌ల్ హాస‌న్ లు సంతాపం

తమిళ వెటరన్ స్టార్ హీరో కెప్టెన్ విజయకాంత్ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అధికార లాంచ‌నాల‌తో నిర్వ‌హించ‌నున్నారు… తమిళ సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు విజయకాంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాల‌కృష్ట‌లు కూడా విజయకాంత్ మరణం పట్ల స్పందించారు.

‘విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి. విజయకాంత్ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమిళ చిత్రసీమలో కథానాయకుడిగా తనదైన స్థానాన్ని కలిగిన విజయకాంత్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరించారు. కుటుంబ కథాంశాలతోపాటు సామాజిక అంశాలు మేళవించిన యాక్షన్ చిత్రాలలో విజయ కాంత్ నటించారు. సామాజిక స్పృహతో డీఎండీకే పార్టీ స్థాపించారు. 2005లో విజయకాంత్ గారు పార్టీ ప్రకటించిన రోజు నేను మధురై ప్రాంతంలో షూటింగ్ లో ఉన్నాను. అక్కడి ప్రజల స్పందన ప్రత్యక్షంగా చూశాను. ప్రజల పట్ల విజయకాంత్ గారు స్పందించే తీరు, సమస్య వస్తే తెగించి పోరాడి అండగా నిలిచే విధానం మెచ్చుకోదగినవి. ఆపదలో ఉన్నవారిపట్ల మానవతా దృక్పథంతో స్పందించేవారు. ఆయనకు తొలి అడుగులో ఎదురైన ఫలితానికి అధైర్యపడక రాజకీయాల్లో నిలబడ్డారు. అదే ఆయన పోరాటపటిమను తెలియచేస్తుంది. పరిస్థితులకు ఎదురొడ్డి సింహంలా నిలిచేవారు. ఆయనకు సినీ సహచరుల నుంచి అవమానాలు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ తత్వంతోనే తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షం వహించారు. విజయకాంత్ ను చివరిసారిగా 2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కలిశాను. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగ్గ నాయకుడు అని ఎందరో భావించారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మృతికి దిగ్భ్రాంతిని తెలియచేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రాజకీయ వారసత్వాన్ని ఆయన సతీమణి ప్రేమలత గారు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు.

“హీరో, డీఎండీకే అధినేత విజయ్‌ కాంత్‌ మృతి బాధాకరం. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అకాల మరణం ఒక్క కోలీవుడ్‌కే కాదు యావత్‌ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు. ‘ఇనిక్కుం ఇలామై సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన విజయ్‌ కాంత్‌ 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అభిమానుల్ని సంపాదిచుకున్నారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు”

  • బాలకృష్ణ (Balakrishna)

“సోదరుడు, డీఎండీకే అధ్యక్షుడు, విజయకాంత్‌ మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగారు. నిర్భయం, ధైర్యం అతడిలో గొప్ప లక్షణాలు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు. విజయకాంత్‌ జ్ఞాపకాల్లో చిరస్థ్థాయిగా నిలిచిపోతారు’’ – కమల్‌ హాసన్

విజయకాంత్‌గారి మరణ వార్త బాధాకరం. సినిమా, రాజకీమాల్లో ఆయన ఓ పవర్‌హౌస్‌. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. – ఎన్టీఆర్‌

- Advertisement -

విజయకాంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. కెప్టెన్‌గా ఎంతోమంది హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబానికి, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా – ఖుష్బూ

మనసున్న మనిషి. మహానుభావుడు. విజయకాంత్‌ ఇకలేరన్న నిజాన్ని నమ్మడం కష్టంగా ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి చేసుకుంటున్నాను – రచయిత పరుచూరి గోపాలకృష్ణ

కెప్టెన్‌ ఆత్మకు శాంతి కలగాలి. ఆయనతో నాకున్న అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి -త్రిష

Advertisement

తాజా వార్తలు

Advertisement