సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’.’. ఇప్పటి రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రాట్ సిస్టమ్, న్యాయవ్యవస్థ ఎలా ఉండాలి. ఈ మూడు వ్యవస్థలు ఏది ఒకటి గాడి తప్పినా సమాజం ఎలా ఇబ్బంది పడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ రూపొందిన ‘రిపబ్లిక్’ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్స్, న్యాయవవస్థ మూడు గుర్రాలు.. ఈ మూడు సక్రమంగా ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయ వ్యవస్థ తానే బలవంతమైన వ్యవస్థ అనుకుని మిగిలిన రెండు వ్యవస్థలను కంట్రోల్ చేయాలనుకోవడం వల్ల వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు దేవ కట్టా.
ఆయన తెరకెక్కించిన ప్రస్థానం, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో చూపించిన పొలిటికల్ డ్రామా కంటే, రిపబ్లిక్ సినిమాలో పొలిటికల్ నేపథ్యాన్ని ఎక్కువగా చూపించారు. సినిమా ప్రారంభం నుంచి చివరకు వరకు సినిమాను ఓ టెంపోలోనే తీసుకెళ్లారు.అసలు వ్యవస్థలో ఎక్కడ లోపముంది అనే పాయింట్‌ను సునిశితంగా స్పృశించారు డైరెక్టర్ దేవకట్టా. దీనికి తగినట్లు పవర్‌ఫుల్ డైలాగ్స్‌ను రాసుకున్నారు. రమ్యకృష్ణ- సాయితేజ్ మధ్య సమాజం గురించి నడిచే సన్నివేశం, సాయితేజ్ కోర్టు సీన్, జగపతిబాబు, సాయితేజ్ మధ్య నడిచే ఎమోషనల్ ట్రాక్.. ఇలా సన్నివేశాలకు అనుగుణంగా రైటర్‌గానూ దేవ కట్టా తన కలం బలాన్ని చూపించారు.
ఇక హీరో సాయితేజ్ నటుడిగా మంచి నటనను ప్రదర్శించాడు. సాయి తేజ్ యాక్టింగ్ ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఈ ‘రిపబ్లిక్’ సినిమా మరో ఎత్తు అని చెప్పాలి.. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తేజ్.. ఎమోషనల్ సీన్స్‌లో హావభావాలతో ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు అనడం కంటే ఈ క్యారెక్టరే అతణ్ణి సెలెక్ట్ చేసుకుంది అనడం బెటర్.. ఈ కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడే తేజ్ నటుడిగా ఛాలెంజింగ్ రోల్ చెయ్యడానికి ఫిక్స్ అయిపోయాడు. ఇక ఐశ్వర్యా రాజేశ్ పాత్ర పరిమితం.. తన పాత్రకు ఆమె న్యాయం చేసింది. ఇక సినిమాలో మెయిన్ రోల్‌లో నటించిన రమ్యకృష్ణ తను తప్ప మరొకరు చేయలేరనేంత గొప్పగా ఈ పాత్రలో ఇమిడిపోయారు. పొలిటికల్ లీడర్‌గా ఆమె నటనలో చూపించిన షేడ్స్, పాత్రనుగుణంగా చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ఇక జగపతిబాబు పాత్రలో ఎమోషనల్ కోణం కనిపిస్తుంది. ఆయన కూడా తన పాత్రకు తగ్గట్లు చక్కగా యాక్ట్ చేశారు. బాక్సర్ దిన, రాహుల్ రామకృష్ణ, ఆమని తదితరులు వారి వారి పాత్రల్లో మెప్పించారు.
దర్శకుడు దేవ కట్టా సందర్భానుసారం రెండు పాటలు, థీమ్ సాంగ్స్, ఫైట్స్ తప్ప కామెడీ ట్రాక్, ఐటెం సాంగ్స్ ఇంకా ఇతరత్రా కమర్షియల్ హంగులకు పోకుండా డైరెక్ట్‌గా కథ చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాలంటే ఏంటో.. అవి ఎలా ఉంటాయో జనాలకు చూపించారు.. భావోద్వేగాలతో ఆలోచింపజేసేలా ఉన్న ‘రిపబ్లిక్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి: