Saturday, November 23, 2024

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఊరట.. దివాలా ప్రక్రియపై స్టే

ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రై జెస్‌ లిమిటెడ్‌కు ఊరట లభించింది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులపై జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) శుక్రవారం నాడు స్టే ఇచ్చింది. ఈ మేరకు జీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ పునీత్‌ గొయెంగా దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చింది. జీ గ్రూప్‌ సంస్థ సిటీ నెట్‌వర్క్స్‌ 89 కోట్ల రూపాయలు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు బకాయిపడింది. ఈ రుణానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ హామీదారుగా ఉంది. దీంతో దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఎన్‌సీఎల్‌టీని కోరింది. దీనిపై పరిష్కార నిపుణుడిగా సంజీవ్‌ కుమార్‌ జలాన్‌ ను నియమించింది.

సిటీ నెట్‌వర్క్స్‌ పైనా దివాలా ప్రక్రియకు బ్యాంక్‌ వేరే పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో పునీత్‌ గొయెంకా పిటిషన్‌ వేయడంతో దివాలా ప్రక్రియపై అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ స్టే విధించింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ పరిష్కార నిపుణుడిని ఉంచి సమాధానం కోసం నోటీస్‌లు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29కి వాయిదా పడింది. సోనీ టీవీతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. తాము భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని, సోనీ టీవీతో విలీనం అంశంపై దృష్టి సారించినట్లు పునీత్‌ గొయెంకా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement