Saturday, November 23, 2024

రిలయన్స్‌-డిస్నీ విలీనం.. తుది దశకు చర్చలు

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో మరో భారీ విలీనానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీకి చెందిన డిస్నీ ఇండియాకు చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనానికి సంబంధించిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు సంస్థల విలీనం తరువాత ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ యాజమాన్యం నియంత్రణ వాటా 51 శాతంతో అతి పెద్ద షేరుహోల్డర్‌గా నిలుస్తుంది.

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతిపెద్ద సంస్థగానూ అవతరించనుంది. డిస్నీ విలీన సంస్థలో 49 శాతం వాటా ఉండనున్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18కి అనుబంధ సంస్థగా విలీన సంస్థను ఏర్పాటు చేయనున్నారు. యాజమాన్య వాటా కోసం రిలయన్స్‌ నగదు రూపంలో చెల్లించనుంది. నగదు మొత్తం, ఇతర వివరాలు ఇరు వర్గాలు వెల్లడించలేదు.

విలీనం తరువాత ఏర్పడే సంస్థ బోర్డులో రిలయన్స్‌, డిస్నీకి సమాన ప్రాతినిధ్యం ఉండనుంది. ఒక్కో సంస్థ నుంచి ఇద్దరు డైరెక్టర్లుగా ఉంటారు. వయాకామ్‌లో అతి పెద్ద వాటాదారు అయిన బోది ట్రోకి బోర్డులో చోటు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి నాటికి విలీనం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్‌ ఇండియాకు 77 ఛానళ్లు ఉండగా, వయాకామ్‌కు 38 ఛానళ్లు ఉన్నాయి. డిస్నీకి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, రిలయన్స్‌కు జియో సినిమా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. విలీనంపై ఇరు సంస్థలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement