సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ చిత్రానికి రిమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది.
పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగులో పాల్గొన్నారు. ఇదే విషయాన్ని చెబుతూ పవన్ ఈ సినిమాలో భీమ్లా నాయక్ పాత్రలో కనిపించబోతున్నాడని… అలాగే ఓ మేకింగ్ వీడియోని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలో పవన్ తో నటించడం పట్ల రానా తాజాగా స్పందించారు.
ఆయనకు సినిమాపై ఉన్న జ్ఞానం అపార అనుబంధం చూసి ఆశ్చర్యమేసిందని… సినిమాను ఆయన చూసే విధానం కొత్తగా ఉంటుందని రానా చెప్పుకొచ్చారు. పాత్రను పవన్ అర్థం చేసుకునే విధానం పాత్ర స్వభావాన్ని త్వరగా పట్టుకోవడం పవన్ కు ఉన్న గొప్ప లక్షణం అని అనుభవం ఉన్న యాక్టర్స్ తో వర్క్ చేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవచ్చని అది కూడా పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి అయితే ప్రతిరోజు నేర్చుకోవచ్చని అన్నారు.