సినిమాలతో పాటు తన రాజకీయ జీవితంలో భారీ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రెండు రంగాల్లోనూ ఆయన చేస్తున్న పనులు.. తనను ఫాలో అయ్యే అనేకమందికి ఆసక్తితో పాటు స్ఫూర్తిని కలిగిస్తాయని చెప్పవచ్చు. తన అభిమానులు సోషల్ మీడియాలో అప్‌డేట్లు, ప్రకటనల కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తునే ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కి అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ ఉంది.. అందులో 5.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ ఈ రోజు (మంగళవారం జులై 4వ తేదీన) మరో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో అడుగు పెట్టారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నటుడు త్వరలో తన ఇన్‌స్టాగ్రామ్ అరంగేట్రం చేయబోతున్నట్లు నిన్న సూచించడంతో.. ఈ ప్రకటన పవర్ స్టార్ అభిమానులందరినీ ఉర్రూతలూగించింది. హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ లో జాయిన్ అయిన కొన్ని గంటలకే మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇది అతని భారీ ప్రజాదరణను రుజువు చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు పవన్ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అతని మొదటి పోస్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది అతని రాజకీయ అభిప్రాయాలు లేదా సినిమాకి సంబంధించిన ఏదైనా ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇప్పటివరకు తన ట్విట్టర్ ఖాతాను ఎక్కువగా రాజకీయాలకు.. అతని జనసేన పార్టీకి అంకితం చేశాడు పవన్. దీంతో ఈ ఫోటో-షేరింగ్ యాప్‌లో అతను ఏమి పోస్ట్ చేస్తాడో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.