హైదరాబాద్, ఆంధ్రప్రభ: సినిమా రంగం వేరు…రాజకీయాలు వేరు అని సినీ నటుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నారు. సినీహీరో నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్కు ముఖ్యఅతిథిగా పవన్కళ్యాణ్ హాజరై మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎవరి సొత్తు కాదని, ఇది అందరి సొత్తు అని అన్నారు. సినిమా రంగం వేరు రాజకీయ రంగం వేరన్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటిని తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని తనకు అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమంటే తన కుటుంబంతోపాటు… ఏ ఒక్క కుటంబం సొత్తు కాదని, ఇది మన అందరిదీ అని పునరుద్ఘాటించారు. 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా అని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా సినిమా పరిశ్రమని, విభిన్న మతాలు, కులాలకు చెందిన వారు పరిశ్రమలో పనిచేస్తారన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందరూ కలిస్తేనే సినిమా ఇండ్రస్ట్రీ అని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే నాకు అపారమైన ప్రేమ, అభిమానం ఉందన్నారు. సినిమా బాగా ఆడడానికి దర్శకుడే వెన్నుముక అన్నారు. తన సినిమా జీవితానికి సంబంధించిన ఏవీ చూస్తున్నప్పుడు తనకు భయమేసిందన్నారు. సినిమాలో డాన్సులు వేయాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని, కేవలం అభిమానుల కోసమే వేస్తుంటాని ఆయన పేర్కొన్నారు. ప్రీరిలీజ్ ఫంక్షన్కు వచ్చిన అభిమానులందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆయన సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.