Friday, November 22, 2024

Trending : అతుకుల శ‌రీర భాగాలు ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి….మౌనం వీడి మాట్లాడండి….మృణాల్ ఠాకూర్

రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో చాలా మంది కృత్రిమ మేధస్సును తప్పుగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ మాత్రమే కాదు, రష్మిక మందన్న స్నేహితులు సహచరులు పెద్ద ఎత్తున‌ మద్దతుగా ముందుకు వచ్చారు. ర‌ష్మిక‌ డీప్‌ఫేక్ వీడియోని నిజ‌మైన‌దిగా అమాయ ప్ర‌జ‌లు భావించే వీలుంది. అందుకే ర‌ష్మిక వెంట‌నే వీడియోపై స్పందించారు. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య స‌హా మృణాల్ ఠాకూర్, చిన్మయి శ్రీపాద వంటి చాలా మంది ప్రముఖులు కృత్రిమ మేధస్సు (AI) దుర్వినియోగం గురించి మాట్లాడటానికి ముందుకు వచ్చారు.

ర‌ష్మిక ఘ‌ట‌న అనంత‌రం మృణాల్ ఠాకూర్ సోమవారం అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక నోట్ రాశారు. అందులో ఇలా ఉంది. “ఇలాంటివాటిని ఆశ్రయించే వ్యక్తులకు సిగ్గుండాలి. అలాంటి వారిలో మనస్సాక్షి అస్సలు ఉండదని ఇది చూపిస్తుంది. ఇప్పటివరకు మనం చాలా గ్లింప్సెస్ చూసిన ఈ సమస్యను పరిష్కరించినందుకు @ర‌ష్మిక మంద‌న‌కు ధన్యవాదాలు. మనం మౌనంగా ఉంటున్నాం. ప్రతిరోజూ మ‌హిళా నటీనటుల మార్ఫింగ్, ఎడిట్ చేయబడిన వీడియోలు ఇంటర్నెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూనే ఉన్నాయి. అతుకులు వేసిన‌ శరీర భాగాలను జూమ్ చేస్తూ.. సోష‌ల్ మీడియాల్లో తిరుగుతూనే ఉన్నాయి. మనం ఒక సంఘంగా, సమాజంగా ఎటువైపు పయనిస్తున్నాము? అన్న‌ది ముఖ్యం. మనం ప్రముఖంగా నటీమణులం కావచ్చు కానీ రోజు చివరిలో మనలో ప్రతి ఒక్కరూ మనుషులం. మనం దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మౌనంగా ఉండకండి.. ఇప్పుడు సమయం ఇంకా లేదు! అని మృణాల్ రాసారు.

మార్ఫింగ్ ఫోటోపై రష్మిక చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా నాగ చైతన్య ఇలా రాశాడు. “టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూడటం నిజంగా నిరుత్సాహపరుస్తుంది. భవిష్యత్తులో ఇది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందోన‌నే ఆలోచన మరింత భయానకంగా ఉంది. ఘ‌ట‌న‌పై చర్యలు తీసుకోవాలి.. ఇలాంటివి ఆపేందుకు చట్టం చేయాలి. దీని బారిన పడే వ్యక్తులను రక్షించడానికి చ‌ట్టాన్ని క‌ఠినంగా అమలు చేయాలి” అని రాసారు. తనకు మద్దతుగా నిలిచినందుకు చైత‌న్య‌కు రష్మిక ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement