ఆరోగ్యానికి ప్రమాదకరమైన పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నివారించడంపై కేంద్ర ఆరోగ్యశాఖ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పొగాకు నివారణ ప్రకటనలపై ప్రధానంగా దృష్టిసారించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్రకటనలను స్కిప్ చేయడానికి వీల్లేనివిధంగా ప్రసారం చేయించాలని భావిస్తున్నది.
ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందడమే తరువాయి.. 20 సెకన్లపాటు అంతరాయం లేకుండా ప్రకటన ప్రసారం అవుతుంది. ఈ మేరకు ఓటీటీలకు సంబంధించి ముసాయిదా నిబంధనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీచేసింది. ముసాయిదా ప్రకారం, దేశ, విదేశీ చిత్రాలతో సంబంధం లేకుండా, సీబీఎఫ్‌ఏసీ సర్టిఫికెట్‌తో నిమిత్తం లేకుండా 2023 సెప్టెంబర్ 1నుంచి సవరించిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది.
స్ట్రీమింగ్ ప్రారంభం, మధ్యలో కలిసి కనీసం 30 సెకన్లపాటు పొగాకు వల్ల కలిగే అనర్థాలపై ప్రకటనలు ప్రదర్శించాల్సి ఉంటుంది. గతేడాది ఓటీటీకి ఈ నిబంధనలు తీసుకొచ్చారు. కానీ, అందులో ఫిల్మ్ అనే నిబంధనను స్పష్టంగా పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కిప్ చేయడానికి వీల్లేని ప్రకటనలు ఉండాలని నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా, సోనీ లైవ్ వంటి ఓటీటీలు పొగాకు వినియోగాన్ని నివారించే ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయి.