హైదరాబాద్ , ఆంధ్రప్రభ : డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 19 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను 29 వ నిందితుడిగా చేర్చినట్లు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నవదీప్ న్యాయవాది వాదనలు ఇలా ఉన్నాయి. డ్రగ్స్ కేసుతో నవదీప్‌కు ఏ మాత్రంసంబంధం లేదు.., అతను ఎక్కడికీ పారిపోలేదు.., తాను పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పడం సరికాదు. తనను అరెస్టు చేయకుండా పోలీసులను నిలురించాలని హైకోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ నెల 19 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, సీపీ, నార్కోటిక్స్ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, నగరంలోని మాధాపూర్‌లోని విఠల్ నగర్‌లో ఉన్న ఫ్రెష్‌లివింగ్ అపార్ట్ మెంట్స్‌లో ఆగస్టు 31 న నార్కోటిక్స్ అధికారులు దాడులు నిర్వహించగా, ఫిల్మ్ ఫైనాన్షియర్ కె వెంకటరమణారెడ్డితో పాటు డియర్ మెఘా డైరెక్టర్ అనుగు సుశాంత్ రెడ్డిని అరెస్టు చేసి రూ. 10 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 8మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వారిలో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. మిగతా వారు టాలివుడ్‌కు చెందిన వారుగా గుర్తించారు. మాధాపూర్ డ్రగ్స్ కేసుదర్యాప్తులో బాగంగా నిందితులను విచారించగా తీగలాగితే డొంక కదిలినట్లు డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్‌కు చెందిన నటులు, నటీమణులు, దర్శకులు ఇతరులకు సంబంధం ఉందని తేలింది. ఇదే విషయాన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ వ్యవహారంలో నవదీప్‌తో పాటు షాడో చిత్ర నిర్మాత ఉప్పలపాటి రవి, మోడల్ శ్వేత, మాజీ ఎంపి విఠల్ రావు కొడుకు సురేష్ రావు, కార్తీక్, కలహర్ రెడ్డి, ఇంద్రతేజ్ తదితరులకు సంబంధాలు ఉన్నట్లు తేలిందని ప్రకటించిన విషయం తెలిసిందే. వీరికి డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉండడంతో పాటు డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించినట్లు చెప్పారు. నవదీప్ తన స్నేహితుడు రామచంద్రతో పాటు డ్రగ్స్ కొన్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 17 మంది పరారీలో ఉన్నారని ,వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు కూడా వెల్లడించారు.