మన దేశంలో చాలా ఓటీటీ సంస్థలు తమ యూజర్లకు ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌ల్లో కంటెంట్‌ను వీక్షించేందుకు అనుమతి ఇస్తున్నాయి. కరోనా సమయంలోఓ థియేటర్లు మూతపడటంతో పెద్ద సంఖ్యలో ఓటీటీ వైపు ఆసక్తి చూపించారు. దీని వల్ల ఈ సంస్థలకు భారీగా చందాదారులు పెరిగారు. కరోనా తరువాత ఓటీటీల సబ్‌స్క్రిప్షన్స్‌లో పెద్దగా పెరుగుదల లేదు. దీనికి పాస్‌వర్డ్ షేరింగ్ విధానమే కారణమని ఓటీటీ సంస్థలు భావిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొత్త సంవత్సరం నుంచి పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని తొలగించాలని భావిస్తోంది. 2023 జనవరి నుంచి యూజర్లు ఇతరులతో తమ పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకోవడం కుదరదని తెలిపింది.
గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా సబ్‌స్కైబర్ల సంఖ్య తగ్గిపోయిందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. పాస్‌వర్డ్ షేరింగ్ విధానం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. యూజర్లు తమ పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవాలంటే దానికి కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
నెట్‌ఫ్లిక్స్ ఈ విదానాన్ని ఇప్పటికే అమెరికా, కోస్టారికా, చిలీ, పెరూ వంటి దేశాల్లో అమలు చేస్తోంది. ఈ దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ రుసుం మూడు డాలర్లుగా నిర్ణయించింది. మన దేశంలో ఈ ఫీజు ఎంత ఉంటుందన్నది ఇంకా వెల్లడించలేదు. మన దేశంలో నెట్‌ఫ్లిక్స్ నాలుగు రకాల ప్లాన్లను అందిస్తోంది. మొబైల్ ఫోన్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లు. మొబైల్ ఫోన్ నెలవారి ఫీ 149 రూపాయలుగా ఉంది. బేసిక్ ప్లాన్ 199రూపాయలు, స్టాండర్డ్ ప్లాన్ 199 రూపాయలు, ప్రీమియం ప్లాన్‌కు నెలకు 649 రూపాయలుగా ఉంది. పాస్‌వర్డ్ షేర్ చేయాలంటే వీటికి అదనంగా మరింత చెల్లించాల్సి ఉంటుంది.