Monday, November 18, 2024

గాలి సంపత్ రివ్యూ..

శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో ఎన్ కృష్ణ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గాలి సంపత్. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రాజేంద్రప్రసాద్ శ్రీ విష్ణు నటించారు. రాజేంద్ర ప్రసాద్ ఒక గొప్ప నటుడు అని మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నారు. మొత్తం సినిమా ఆయన భుజాలపైన తీసుకెళ్లారనడంలో అతిశయోక్తి లేదు.ఇక కథ విషయానికి వస్తే గాలి సంపత్ గా రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో నటించారు.

గాలి సంపత్ కు మాటలు రావు. కానీ చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఓ వ్యక్తి గాలి సంపత్ మాట్లాడే భాషను డబ్బింగ్ చెబుతూ ఉంటాడు. మరోవైపు తండ్రి ప్రవర్తన కొడుకుకి నచ్చదు. ట్రక్ డ్రైవర్ గా అరకువేలిలో పని చేసుకుంటూ ఆ ఊరి సర్పంచ్ కూతురుతో ప్రేమలో పడతాడు శ్రీ విష్ణు. సొంతంగా ట్రక్ కొనుక్కొని జీవితంలో సెటిల్ అవ్వాలని శ్రీ విష్ణు భావిస్తుంటాడు. అది గమనించిన గాలి సంపత్ ఎలాగైనా ఐదు లక్షలు ఏర్పాటు చేయాలని అనుకుంటాడు. ఆ సమయంలో పరిషత్తు పోటీ ప్రకటన వెలువడుతుంది. మొదటి బహుమతి గెలుచుకుంటే 8 లక్షల బహుమతి వస్తుందని గాలి సంపత్ భావిస్తాడు. అందుకోసం ముందుగా ఐదు లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే స్లాట్ బుక్ చేస్తామని నాటకాలకు సంబంధించిన కాంట్రాక్టర్ మాట్లాడం వింటాడు. అది నమ్మి కొడుకు దాచుకున్న ఐదు లక్షలు దొంగిలిస్తాడు. మరోవైపు కొడుకు ప్రేమించిన అమ్మాయి తో పెళ్లి కూడా తెలియక చెడగొడతాడు. ఇలా తెలియక చేసిన తప్పులు అన్నింటికీ కొడుకు కోపానికి గాలి సంపత్ గురవుతాడు. ఆ సమయంలో ఇంటి ముందు ఉన్న నూతిలో గాలి సంపత్ పడిపోతాడు. పోతే పోయాడు అనుకొని కొడుకు కూడా పట్టించుకోడు. ఆ సమయంలో గాలి సంపత్ చిన్ననాటి స్నేహితుడు తన తండ్రి తన కోసం చిన్ననాటినుండి ఏం చేశాడో శ్రీవిష్ణుకి చెప్తాడు.అప్పటినుంచి తండ్రి కోసం వెతకటం మొదలు పెడతాడు కొడుకు. ఇంతకీ గాలి సంపత్ ఎవరు.. అతని కథ ఏంటి… మళ్లీ తండ్రి కొడుకులు ఎలా కలిసారు.. అనేదే కథ.

ఇక నటీనటుల విషయానికి వస్తే రాజేంద్రప్రసాద్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. ఆ పాత్రలో రాజేంద్రప్రసాద్ కాకుండా వేరొకరిని ఊహించుకోలేం. ఆ విధంగా ఆకట్టుకున్నారు. మొత్తం సగటు ప్రేక్షకుడిని కూర్చోబెట్టి, నవ్వించి ఏడిపించాడు. సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు మొత్తం రాజేంద్రప్రసాద్ నడిపించాడు అంటే అర్థం చేసుకోవచ్చు. తండ్రి వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీ విష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు.ఏదో చేశాం అన్నట్టుగా కాకుండా మొదటి నుంచి శ్రీ విష్ణు పాత్రల ఎంపిక కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా మంచి పాత్రను ఎంచుకుని ఆ పాత్రలో పర్ఫెక్ట్ గా నటించాడు శ్రీవిష్ణు. నిజానికి ఈ సినిమా మొత్తం గా అయితే ఇందులో గాలి సంపత్‌కి కొడుకుగా ఇతనైతేనే పర్ఫెక్ట్ అనేట్టుగా చేశాడు శ్రీవిష్ణు. మిగిలిన పాత్రలు కూడా బాగానే ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ప్రతి యాంగిల్, కథలో పాత్రలు అన్ని ఎమోషన్ ని బ్యాలెన్స్ చేశారు దర్శకుడు. ఎక్కడ బోర్ కొట్టకుండా చకచకా సాగిపోయే స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది. మిగతా నటి నటులు కూడా వారి వారి పాత్రల్లో బాగా నటించారు.మొత్తానికి గాలి సంపత్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లో చర్చ సాదించిందనే చెప్పాలి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement