విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏపీలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. కాగా నిరసనకారులకు సినీ రాజకీయ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇక తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నిరసన చేస్తున్న వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన మద్దతును ప్రకటించారు.
ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం. విశాఖ ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.నర్సాపురం వై యన్ ఎం కాలేజీ లో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద విశాఖ ఉక్కు సాధిస్తాం.అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు,9 ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక గా భావించి సంతోషించాం. విశాఖ ఉక్కు కు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం.
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం, అందువల్ల నష్టాలొస్తున్నా యనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షం గా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించు కోవాలని కోరుతున్నాను. ఉద్యోగస్థులు, కార్మికుల భవిష్యతను, ప్రజల మనోభావాలను గౌరవించికేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇది ప్రాంతాలకు , పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన ,న్యాయ సమ్మతమైన హక్కు ఆ హక్కును ఉక్కు సంకల్పం తో కాపాడుకుందాం.