కాజల్ అగర్వాల్, మంచు విష్ణు ప్రధాన పాత్రలో జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మోసగాళ్లు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అక్కా తమ్ముళ్లుగా నటించిన ఈ సినిమా అతిపెద్ద ఐటీ స్కామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా కథ విషయానికి వెళ్తే…. అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కవలలు. ఈ ఇద్దరిలో అను, అర్జున్ కంటే పెద్దది. ఇక తనికెళ్ళ భరణి ఈ ఇద్దరికీ తండ్రి. నీతి, నిజాయితీని నమ్ముకొని బ్రతికే తనికెళ్ళ భరణిని ఒకరు మోసం చేస్తారు. దీనితో వారి జీవితాలు రోడ్డున్న పడతాయి. పెద్దయ్యాక అర్జున్, అను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వస్తారు. అర్జున్ కాల్ సెంటర్‌లో పని చేస్తూ డబ్బు సంపాదించి ఎలాగైనా కోటేశ్వరుడిని అవ్వాలనే ఆలోచనతో ఉంటాడు.
కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తూ అక్కడి డేటా చోరీ చేసి చిన్న చిన్న మోసాలు కూడా చేస్తుంటాడు. అయితే అర్జున్ టాలెంట్ చూసిఆ కాల్ సెంటర్ యజమాని విజయ్ (నవదీప్) భారీ స్కామ్ చేద్దామని అంటాడు. ఆ ఇద్దరు చేతులు కలిపి అమెరికన్ల నుంచి డాలర్లు కొల్లగొట్టే పెద్ద స్కామ్ ని స్టార్ట్ చేస్తారు. ఇక ఈ ఇద్దరికి అను తోడై ఈ భారీ మోసానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. టాక్స్ పేరుతో అమెరికా ప్రజలను బెదిరిస్తూ 300 మిలియన్ డాలర్స్ అంటే మన భాషలో అక్షరాలా 26 వేల కోట్లు స్కామ్ చేస్తారు.
ఇక వీరిని పట్టుకోడానికి ఏసీపీ కుమార్ (సునీల్ శెట్టి) రంగంలోకి దిగుతాడు. పై ఆఫీసర్ల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా అర్జున్ మోసాన్ని బయటపెట్టి చివరకు అరెస్ట్ చేస్తాడు. అయితే అర్జున్ బయటపడ్డాడా లేదా? అను ఏం చేయబోతుంది.. తనికెళ్ళ భరణి పరిస్థితి ఏంటి అనేదే ఈ కథ. నటన పరంగా మంచు విష్ణు, కాజల్,నవదీప్, సునీల్ శెట్టి అందరు అద్భుతంగా చేసారు. సినిమా అంతా డబ్బు చుట్టే తిరుగుతూ ప్రేక్షకుడికి తరువాత ఏం జరగబోతుందనే ఒక ఇంట్రెస్ట్ ను తీసుకువచ్చారు. డైరెక్టర్ కూడా కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణుకు ఈ సినిమా హిట్ ను అందించిందనే చెప్పాలి.