మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ‘మా’ లో గత కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణలు పలువురు రచ్చకెక్కడంతో వివాదం నెలకొంది. దీంతో ఈ విషయం పై సీరియస్ అయిన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకోవడం పై చిరంజీవి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి.
‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు చిరంజీవి ఓ లేఖ రాశారు. ఇందులో ‘మా’ ఎన్నికలు వెంటనే జరపాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఆలస్యమైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయన్నారు. “ప్రతి రెండేళ్లకు మార్చిలో నిర్వహించాల్సిన ఎన్నికలు ఈ సారి కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. ప్రస్తుత కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేసుకోవాలి. జాప్యం లేకుండా ‘మా’ ఎన్నికలు వెంటనే జరగాలి. ఇటీవల ‘మా’ సభ్యులు కొందరు మీడియా ముందుకు వెళ్లి తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తంచేయడం వల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని కట్టడిచేయాలి. ఎవరికైనా అభిప్రాయభేదాలు, మనస్పర్థలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్పితే బహిరంగంగా విమర్శలు చేయడం మంచిది కాదన్నది నా అభిప్రాయం’ అని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు: రేవంత్