నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా గత నెల జూన్ 27న రిలీజయి భారీ విజయం సాధించింది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన కల్కి సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కల్కి సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది.
అయితే తాజాగా ఓ స్వామిజి కల్కి నిర్మాతలకు, నటులకు నోటీసులు పంచారు. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ తో సహా కల్కి 2898 AD నిర్మాతలు, నటులకు ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు.
ఆచార్య ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ.. సనాతన గ్రంథాలను మార్చకూడదు. ఈ సినిమాలో దేవుడిని తప్పుగా చిత్రించారని, హిందూ పురాణాలకు భిన్నంగా వర్ణించారని అన్నారు. కల్కి గురించి పురాణాల్లో, గ్రంధాల్లో స్పష్టంగా ఉంది. అది కాకుండా వీళ్లకు ఇష్టం వచ్చినట్టు మార్చి తీశారు అని అన్నారు. కల్కి దేవుడికి సంబంధించి మౌలిక విషయాలను కూడా ఈ సినిమా పూర్తిగా భిన్నంగా చిత్రించింది. కల్కీ దేవుడికి సంబంధించిన వృత్తాంతాన్ని పూర్తిగా తప్పుగా చిత్రించారు. ఇది పవిత్ర గ్రంథాలను అవమానించడమే అవుతుందని అన్నారు.