Sunday, November 10, 2024

సినిమాల‌కు గుడ్‌బై్ చెప్ప‌నున్న లేడీ సూప‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి.. ఆమె అస‌లు క‌ల ఇది కాద‌ట‌!

లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్‌ సాయి పల్లవి. సహజసిద్ధమైన నటనతో, అద్భుతమైన నృత్య రీతులతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటిగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటోంది. ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్న‌ది.. త‌న ఫ‌స్ట్ మూవీతోనే పాపులారిటీ తెచ్చుకుంది. తెలంగాణ యాసలో అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకొని శ‌భాష్ అనిపించుకుంది. నేటి తరం హీరోయిన్ల మాదిరిగా గ్లామర్ షోలు, ఎక్స్‌పోజింగ్‌లకు పోకుండా.. నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్న‌ది. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా ఇమేజ్ మాత్రం స్టార్ హీరోల‌ రేంజ్ లో ఉంది.

ఇక.. గ‌త ఏడాది ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో హిట్లు అందుకోవడమే కాకుండా తన నటనకు మరోసారి మంచి మార్కులు తెచ్చుకుంది సాయి పల్లవి. ఈ ఏడాది రానా దగ్గుబాటితో కలిసి నటించిన ‘విరాట పర్వం’ సినిమా కూడా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాలోని త‌న నటన అందరినీ కట్టిపడేసింది. అయితే, ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఆ త‌ర్వాత‌ సాయి పల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన లేడీ-ఓరియెంటెడ్ మూవీ ‘గార్గి’ సైతం ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు సినిమాల త‌ర్వాత సాయి పల్లవి మరే సినిమాల‌కు సైన్ చేయలేదు. ఇక మీదట చేయబోన‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం సినీ వర్గాల్లో సాయి పల్లవికి సంబంధించన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సాయి పల్లవి తన యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. సాయి పల్లవి జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. తాను డాక్టర్‌ అయ్యి పేదలకు సేవ చేయాలన్నదే ఆమె కోరిక. కానీ, సినిమాల్లో బిజీ అయ్యి తన ప్రొఫెషన్‌ను పక్కన పెట్టేసింది. కానీ, ఇప్పుడు తన వృత్తికి న్యాయం చేయాలని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. దీంతో తన సొంతూరు కోయంబత్తూరులో సొంతంగా ఒక హాస్పిటల్ నిర్మించాలని భావిస్తుంద‌ట‌ట. తన చెల్లెలు పూజతో కలిసి హాస్పిటల్ నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించాలని సాయి పల్లవి డిసైడ్ అయిన‌ట్టు సమాచారం. ఈ నిర్ణయమే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనకు కారణం కావచ్చని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే సాయి పల్లవి స్పందించే వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement