వరుస భూకంపాలతో వణికిపోయిన జపాన్ నుంచి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా బయటపడ్డాడు. తాను తిరికి ఇంటికి చేరుకున్నట్లు తారక్ ట్వీట్ చేశాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారం కిందట అతడు జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కొత్త ఏడాది మొదటి రోజైన సోమవారం ( ఏకంగా 155 భూకంపాలు జపాన్ ను వణికించాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ క్షేమ సమాచారం కోసం అభిమానులు తెగ ప్రయత్నించారు.
చివరికి తాను క్షేమంగా తిరిగి వచ్చినట్లు అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. “జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చేశాను. అక్కడి భూకంపాల వార్తలు చూసి షాక్ తిన్నాను. గత వారం రోజులు అక్కడే గడిపాను. భూకంపాల వల్ల ప్రభావితమైన అందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఎంతో దృఢంగా ఉన్నారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని తారక్ ట్వీట్ చేశాడు.