సృష్టికి మూలం అమ్మ. ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. అందుకే అమ్మ తర్వాతే ఎవరైనా అంటారు. ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మదర్స్ డే జరుపుకోవాలన్న ఆలోచన తొలిసారిగా 1872లో ప్రముఖ రచయిత్రి జూలియా వార్డ్ హొవేకు తట్టింది. ఒక సెలవు రోజున మహిళలందరినీ ఒక వేదికపైకి చేర్చి శాంతి ర్యాలీలు తీయాలని భావించారు. అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు ఆమె బోస్టన్‌లో వార్షిక మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. అయితే నేడు మదర్స్‌డే పేరుతో జరుపుకుంటున్న వేడుక మాత్రం వెస్ట్‌వర్జీనియాకు చెందిన సామాజిక కార్యకర్త అన్నా జార్విస్ ప్రవేశ పెట్టినట్లుగా తెలుస్తోంది. తన తల్లి గౌరవార్థం దేశవ్యాప్తంగా సెలవుదినం ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఆమె తల్లి కమ్యూనిటీ హెల్త్ అడ్వకేట్. గ్రామ స్థాయిలో ఉన్న పిల్లల ఆరోగ్యం కోసం జార్విస్ తల్లి ఎంతగానో కృషి చేశారు.
తన తల్లి గౌరవార్థం మదర్స్ డే పేరుతో జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె ప్రచారం నిర్వహించారు. తొలుత ఆమె విన్నపాన్ని అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. అయితే 1911 అమెరికా దేశం మొత్తం మదర్స్‌డేను సెలవుదినంగా పరిగణించాయి. ఇక 1941లో అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ప్రతి ఏటా మే రెండో ఆదివారాన్ని మదర్స్‌డేగా ప్రకటిస్తూ ఓ అధికారిక పత్రంపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే మదర్స్‌డే ప్రకటించినందుకు జార్విస్ చాలా సంతోషం వ్యక్తం చేసినప్పటికీ కాలక్రమంలో ఇది కమర్షియల్‌గా మారిపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.అసలు మదర్స్‌డే నిర్వహించాలంటూ ఎందుకు ఉద్యమం తీసుకొచ్చానా అని పలుమార్లు బాధపడ్డారు కూడా. మళ్లీ క్యాలెండర్ నుంచి మదర్స్‌డేను తొలగించాలంటూ మరో ఉద్యమానికి తెరతీశారు.
కాగా నేడు మాతృ దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు వారి తల్లులతో దిగిన ఫొటోలను షేర్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన తల్లి బర్త్ డే రోజు దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అలానే మహేష్ బాబు తన తల్లి, కూతురు, భార్యకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ మదర్స్ డే విషెస్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందించారు.