మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. రాజకీయ పార్టీలతో, రాజకీయ వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణలతో తన పేరును రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని ఆమె కోరారు.
“తెలుగు సినీ పరిశ్రమ క్రియేటివిటికి, టాలెంట్‌కి, ఫ్రోఫెషనలిజంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. నేను ఇలాంటి ఓ గొప్ప తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు సంతోషంగా వున్నాను. ఇక్కడ నాది ఎంతో అందమైన గొప్ప ప్రయాణం. నాకు ఈ పరిశ్రమతో ఎంతో గొప్ప అనుబంధం వుంది. ఈ రోజున ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై మహిళలపై పుట్టించడం ఎంతో బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలను ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మరో మహిళ చేస్తోంది. అనవసరమైన పుకార్లకు స్పందించకుండా మౌనంగా ఉండటం అనేది మన బలహీనతగా అనుకుంటారు. నేను పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని మనిషిని, నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్ లీడర్‌తో సంబంధం లేదు. నా పేరును మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానేయమని కోరుతున్నాను. దయచేసి సినిమా తారలను, కళాకారులను రాజకీయ పుకార్ల నుంచి దూరంగా వుంచండి. మా పేర్లకు కల్పిత కథలను జోడించి ప్రచారం చేయకండి.. మీరు హెడ్లైన్లో వుండటానికి మా మీద ఇలాంటి చవకబారు వ్యాఖ్యలను చేయకండి’ అని తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో రాసుకొచ్చారు.