Saturday, November 23, 2024

కార్ల ధరలకు రెక్కలు, భారీగా పెరుగుతున్న రేటు.. ధరలు పెంచిన టాటా మోటర్స్‌

కార్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. అన్ని వాహన రంగ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచుతూ పోతున్నాయి. కియా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ ఇప్పటికే కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. తాజాగా టాటా మోటార్స్‌.. ఆ కంపెనీల బాటలోనే నడిచేందుకు నిర్ణయించాయి. తమ వాహనాల ధరలను కూడా పెంచుతున్నట్టు టాటా మోటార్స్‌ శనివారం ప్రకటించింది. అయితే తమ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు గల కారణాలను ఆయా కంపెనీలు వివరించాయి. సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నదని, ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్ల ధరలు పెంచాల్సి వస్తున్నదని ప్రకటించింది. ఒక కారు తయారు కావాలంటే.. స్టీల్‌, ప్లాస్టిక్‌, అల్యూమినియం, కాపర్‌తో పాటు ఇతర విలువైన మెటల్స్‌ అవసరం అవుతాయి. బహిరంగ మార్కెట్‌లో ఈ లోహాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఇప్పుడు ఉన్న ధరలకు విక్రయిస్తే నష్టాలు వస్తాయని, ఆ భారాన్ని తాము మోయలేకపోతున్నామంటూ మారుతీ సుజుకీ ప్రకటించింది.

పరోక్షంగా యుద్ధ ప్రభావం..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం కూడా పరోక్షంగా ధరల పెంపునకు కారణం అవుతున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు కూడా వాహన రంగాన్ని కలవరపెడుతున్నాయి. కారు తయారు చేయడానికి ఉపయోగించే విడి భాగాల దిగుమతికి ఆటంకం ఏర్పడింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు అనుకున్న సమయానికి కార్లు డెలివరీ చేయలేపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విడి భాగాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరిగింది. ఈ కారణంగానే.. కార్ల ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని పలు కంపెనీలు చెబుతున్నాయి. శాంఘైలో లాక్‌డౌన్‌ కారణంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తితో పాటు రవాణా నిలిచిపోయింది. దీంతో వాహన తయారీ రంగంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. కొనుగోళ్లకు సంబంధించి డిమాండ్‌ ఉన్నా.. విడి భాగాల కొరతతో పాటు భారీగా పెరిగిన ఇన్‌పుట్‌ కాస్ట్‌ కారణంగా ఆయా కంపెనీలు సరైన సమయంలో డెలివరీ చేయలేకపోతున్నాయి.

ప్యాసింజర్‌ వాహనాలు ప్రియం..

కియా నుంచి ప్రారంభమైన వాహన ధరల పెంపు తాజాగా మారుతీ సుజుకీ వరకు చేరింది. ఒక తయారీ కంపెనీ తన కార్లు.. ఇతర వాహనాల ధరలను పెంచితే.. మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటో మొబైల్‌ రంగంలో ఎప్పుడూ ఉండేదే.. అదే ఆనవాయితీ మళ్లీ కనిపిస్తున్నది. ధరల పెంపు విషయంలో టాటా మోటార్స్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల ప్యాసింజర్‌ వాహనాల ధరలను పెంచినట్టు టాటా మోటార్స్‌ తెలిపింది. తక్షణమే పెరిగిన ధరలను అమల్లోకి తీసుకొచ్చినట్టు వివరించింది. ఈ మేరకు టాటా మోటార్స్‌ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని మోడల్స్‌ కార్లపై ధరల పెరుగుదల వర్తింస్తుందని వివరించింది. 0.1 శాతం నుంచి 1.1 శాతం వరకు వాటి ధరలు సవరించినట్టు తెలిపింది.

- Advertisement -

మారుతి సుజుకీ ఏడాదిలో 9శాతం..

మారుతీ సుజుకీ కూడా తాజాగా తన వాహన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మారుతీ సుజుకీ బేసిక్‌ కార్‌ మోడల్‌గా పేరున్న ఆల్టో మొదలుకుని.. ఎస్‌క్రాస్‌ వరకు అన్ని వాహన ధరలను సవరించింది. గత సంవత్సరం మారుతీ సుజుకీ యాజమాన్యం మూడు సార్లు కార్ల ధరలను పెంచింది. జనవరిలో 1.4శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం మేర పెంచింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఈ నెల వరకు తొమ్మిది శాతం మేర ధరలు పెంచింది. ఇక మహీంద్రా అండ్‌ మహీంద్రా కూడా కొన్ని రోజుల క్రితమే వాహన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో వాహనంపై అదనంగా రూ.10వేల నుంచి రూ.63వేల వరకు భారడి పడింది.

పెరిగిన కియా కార్ల ధరలు..

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్‌కు చెందిన కియా మోటార్స్‌ కూడా కార్ల ధరలను పెంచింది. కార్ల వివిధ మోడళ్ల రేట్లను కియా ఇండియా భారీగా పెంచేసింది. ఈ ధరల పెంపు ఏప్రిల్‌ 1, 2022 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. భారత్‌ మార్కెట్లో సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌, కారెన్స్‌ వంటి కార్లను కియా ఇండియా ప్రవేశపెట్టింది. ధరల పెంపుతో కియా కారెన్స్‌, కియా సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌ ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయి. కియా తన కార్ల ధరలను భారీగా పెంచేసింది. రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు వడ్డించింది. మోడల్స్ ను బట్టి ఈ ధరలు పెరుగుతూ వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement