Friday, November 22, 2024

బ్ర‌హ్మ‌స్త్ర‌కు భారీ రేట్లు.. థియేట‌ర్ల‌కు జ‌నం వ‌చ్చేనా?

టాలీవుడ్‌లో కొంత కాలంగా సినిమా టికెట్ల రేట్ల‌పై సీరియ‌స్ చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి కదా అని ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో పరిమితికి మించి రేట్లు పెంచేస్తున్నారు మూవీ మేక‌ర్స్. కొవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్ష‌కులు రావడం తగ్గించారు. అయినా.. ఈ విధమైన‌ రేట్లు చూసి చాలామంద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గత నెలలో వచ్చిన సినిమాలన్నింటికీ చాలా వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 రేటు ఉండేలా చూశారు సినీ పెద్ద‌లు. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’కు హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో 325 రూపాయ‌ల ధ‌ర పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ బ్రహ్మాస్త్ర సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది.

అయితే.. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం ఈ సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచింది. సినిమా రిలీజ్ కు వారం రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి. బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ తో పోలిస్తే బ్రహ్మాస్త్ర హిందీ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది. మ‌రి బ్రహ్మాస్త్ర హిందీ వెర్షన్ టికెట్ రేటు హైదరాబాద్ లో 325 రూపాయలుగ ఉండ‌డంపై కూడా చాలామంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీలు కూడా కలిపితే రేటు రూ.360 దాకా అవుతోంది. ఇక‌.. థియేట‌ర్లో స్నాక్స్‌, పాప్‌కార్న్, డ్రింక్స్ వంటి వాటితో త‌డిసి మోపెడు కానుంద‌న్న కామెంట్స్ వ‌స్తున్నాయి.

అయితే.. భారీ బడ్జెట్ మూవీ కావడం, పైగా త్రీడీలో రిలీజ్ చేస్తుండడంతో ఈ రేటు నిర్ణయించినట్లు నిర్మాత‌లు చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. కానీ ప్రేక్షకుల యాంగిల్లో చూస్తే మాత్రం ఈ రేటు చాలా ఎక్కువేనంటున్నారు ప‌రిశీల‌కులు. హిందీతో పాటు తెలుగు వెర్షన్‌కు కూడా ఇదే రేట్ ఫిక్స్ చేయడంతో మన ప్రేక్షకులు ఇంతింత రేటు పెట్టి ఒక అనువాద చిత్రాన్ని చూస్తారా అన్నది సందేహం. ఐతే సినిమాకు డీసెంట్ బజ్ ఉండడంతో బుకింగ్స్ అయితే ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ సినిమాకు మంచి టాక్ రాకపోతే మాత్రం ఈ రేట్లు చాలా చేటు చేసే ప్రమాదం ఉంది.

సినిమా అద్భుతంగా ఉంటే మాత్రమే ప్రేక్షకులు ఆసక్తి చూపే అవకాశాలు ఉంటాయని అన‌లిస్టులు అంటున్నారు. బ్రహ్మాస్త్రం సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మధ్య కాలంలో వరుసగా బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు. అందువల్ల బ్రహ్మాస్త్ర సినిమాపైనే ఈ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే పార్ట్2, పార్ట్3 తెరకెక్కే అవకాశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement